
అభివృద్ధి కార్యక్రమాలపై నిఘా: చిరంజీవి
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడే ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల మీద తాము నిఘా ఉంచుతామని, అదే సమయంలో వాటికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి చెప్పారు. మరో ఇద్దరు నాయకులు జైరాం రమేష్, జేడీ శీలంలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యసభలో ఉన్న ఆంధ్రప్రాంతానికి చెందిన ఎంపీలు, అలాగే రాష్ట్ర వ్యవహారాలను గతంలో చూసిన కొంతమంది ఎంపీలు, ఇతర సీనియర్ నియకులతో కలిసి ఓ కమిటీని ఏర్పాటుచేయాల్సిందిగా కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరామని, ఒకటి రెండు రోజుల్లో ఈ కమిటీ నిర్ధారణ అవుతుందని ఆయన చెప్పారు.
సీమాంధ్ర ప్రాంతం త్వరగా అభివృద్ధి చెందేలా, అభివృద్ధి ఫలాలు అందిరకీ చేరేలా చూస్తామని చిరంజీవి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడే ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను నూరుశాతం అమలు చేయాలని, అందులో వాళ్లు చిత్తశుద్ధితో ఉండాలనే కోరుకుంటున్నామని చెప్పారు. తమ లక్ష్యం కేవలం అభివృద్ధేనని, ఇందులో ఏమాత్రం రాజకీయాలు ఉండవని అన్నారు.