
పవన్ కళ్యాణ్ టీడీపీలో చేరడంలేదు: నాగబాబు
తాను, పవన్ కళ్యాణ్ టీడీపీలో చేరుతున్నట్టు వచ్చిన వార్తలను చిరంజీవి సోదరుడు నాగబాబు ఖండించారు.
హైదరాబాద్: తాను, పవన్ కళ్యాణ్ టీడీపీలో చేరుతున్నట్టు వచ్చిన వార్తలను చిరంజీవి సోదరుడు నాగబాబు ఖండించారు. క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నామని, టీడీపీ చేరుతున్నామని వస్తున్న వార్తలు నిరాధారమని ఆయన కొట్టిపారేశారు. ఈ మేరకు ఆయన ప్రతికా ప్రకటన విడుదల చేశారు.
ప్రస్తుత రాజకీయాల్లోకి వచ్చే తీరిక తమకు లేదని స్పష్టం చేశారు. తాము వృత్తిపరంగా బిజీగా ఉన్నామని పేర్కొన్నారు. వృతికి న్యాయం చేయడమే తమ బాధ్యత అన్నారు. తాము రాజకీయ పార్టీ పెట్టడం లేదని కూడా నాగబాబు స్పష్టం చేశారు. మీడియా కథనాలు అభిమానులను, ప్రజలను గందరగోళపరిచేలా ఉన్నాయని వాపోయారు. మీడియా ఈ విధంగా ప్రచారం చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
కాగా జూనియర్ ఎన్టీఆర్ కు చెక్ పెట్టేందుకు పవన్ కళ్యాణ్ ను టీడీపీ తీసుకొచ్చేందుకు స్వయంగా బాలకృష్ణ రంగంలోకి దిగినట్టు నిన్నంతా మీడియాలో ప్రచారం జరిగింది. నాగబాబుకు కూడా టీడీపీ గాలం వేస్తోందని వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ తమ పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని టీడీపీ నాయకులు ప్రకటించారు. యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులు పవన్ రాకను స్వాగతిస్తున్నట్టు తెలిపారు. అయితే గతానుభవాల దృష్ట్యా రాజకీయాల్లోకి రీ ఎంట్రీపై పవన్ కళ్యాణ్ ఆసక్తి కనబరచడం లేదని సన్నిహితులు అంటున్నారు.