జన్మభూమిని అడ్డుకుని తీరుతాం
ఏపీలో 27వేల మంది డ్వాక్రా యానిమేటర్లకు ప్రతినెలా గౌరవ వేతనం చెల్లించాల్సిందేనని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. ఇందిరాభవన్లో ఆయన డ్వాక్రా యానిమేటర్లు, ఆదర్శ రైతు సమాఖ్య నేతలతో భేటీ అయ్యారు. దసరా పండుగలోపు వారి వేతన బకాయిలను చెల్లించకపోతే.. జన్మభూమి కార్యక్రమాన్ని అడ్డుకుంటారని, వారికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని రఘువీరా చెప్పారు.
దసరాలోపు 30వేల మంది ఆదర్శ రైతులను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం జారీచేసిన జీవోను రద్దుచేయాలని ఆయన అన్నారు. ఆదర్శ రైతులంతా కాంగ్రెస్ వాళ్లేననడం సరికాదని, ఆదర్శ రైతుల్లో అన్ని పార్టీలకు చెందినవారు ఉన్నారని చెప్పారు. తనను దూషించిన కాంగ్రెస్ నాయకులను కూడా టీడీపీలో చేర్చుకుని, వారిని ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిపించుకున్న చరిత్ర చంద్రబాబుదని ఆయన విమర్శించారు. అలాంటి కాంగ్రెస్ నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడంలో లేని అభ్యంతరం ఆదర్శ రైతుల విషయంలో ఎందుకు వచ్చిందని అడిగారు. ఆదర్శరైతులను కొనసాగించాలనే డిమాండుతో ఈనెల 25న ఇందిరాపార్కు వద్ద రెండు రాష్ట్రాల ఆదర్శరైతుల ధర్నా ఉంటుందని ఆయన చెప్పారు.