మళ్లీ మళ్లీ రాసేవారిపై నిఘా!
సాక్షి, హైదరాబాద్: గత ఏడాది ఎంసెట్‌లో మంచి ర్యాంకు పొంది ఇప్పటికే కాలేజీలో చేరిన విద్యార్థులు ఈ ఏడాది కూడా ఎంసెట్ రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారని.. వీరిపై పోలీసు నిఘా పెట్టామని ఎంసెట్ కన్వీనర్ ఎన్వీ రమణారావు చెప్పారు. వేరెవరికైనా సాయం చేసేందుకు వీరు యత్నిస్తున్నారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తామన్నారు. మెడికల్ పీజీ ప్రవేశ పరీక్ష కుంభకోణం నేపథ్యంలో ఎంసెట్‌లో అక్రమాలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఆదివారం ‘సాక్షి’కి చెప్పారు. వివరాలు..
గత ఏడాది మంచి ర్యాంకు వచ్చినా ఈ ఏడాది కూడా ఎంసెట్ రాయడానికి దాదాపు 2 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. మంచి ర్యాంకు వచ్చిన వారు కూడా మళ్లీ ఎందుకు దరఖాస్తు చేసుకున్నారో తెలుసుకోవాలని ఆయా అభ్యర్థుల వివరాలు పోలీసులకు ఇచ్చాం. అనుమానాలుంటే కేసులు నమోదు చేస్తాం.
లేట్ ఫీజు కింద రూ. 5 వేలు కట్టి దరఖాస్తు చేయడం వెనక ఏమైనా ప్రలోభాలున్నాయా? అనే కోణంలోనూ విచారిస్తాం. మెడికల్ పీజీ ఎంట్రెన్స్ కుంభకోణం నేపథ్యంలో.. ఎంసెట్‌లో మాల్‌ప్రాక్టీస్ జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే పోలీసుల సహాయం కోరాం. అక్రమాలకు అడ్డుకట్ట వే సేందుకు ఉన్నతస్థాయి కమిటీ వేయాలని పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేయాలని నిర్ణయించాం. ఈ నెల 12న డీజీపీ, ఇంటిలిజెన్స్ చీఫ్‌తో భేటీ కానున్నాం.
ఎంసెట్ ఏర్పాట్ల పర్యవేక్షణ, అక్రమాల నివారణ కోసం అన్ని పెద్ద సెంటర్లకు నేను స్వయంగా వెళతాను. మిగతా సెంటర్లకు సీనియర్ అధికారులను పంపిస్తాం. ప్రతి 24 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్‌ను నియమించనున్నాం.
పరీక్షా కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ ఉపకరణాలను అనుమతించం. పేపర్‌ను స్కాన్ చేసే కళ్లద్దాలు మార్కెట్‌లోకి వచ్చాయని తెలిసింది. అలాంటివి తీసుకురాకుండా తనిఖీ చేస్తాం. ఎంసెట్‌కు 3.95 లక్షల మంది దరఖాస్తు చేశారు. అందులో 2.85 లక్షల మంది ఇంజనీరింగ్, 1.13 లక్షల మంది మెడికల్ అభ్యర్థులున్నారు. ఈ నెల 8 నుంచి వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.