తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం ఢిల్లీని సైతం గడగడలాడించిన దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారాలపట్టి కేంద్ర మంత్రి పురందేశ్వరి.
చీరాల, న్యూస్‌లైన్ : తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం ఢిల్లీని సైతం గడగడలాడించిన దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారాలపట్టి కేంద్ర మంత్రి పురందేశ్వరి..., సొంత నియోజకవర్గం కాకపోయినా ఇక్కడి ప్రజల అభిమానంతో పోటీ చేసి గెలిచి సామాజికవర్గ నేపథ్యంలో కేంద్ర మంత్రిపదవి అనుభవిస్తున్న పనబాక లక్ష్మి..., ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందే స్థాయి లేకపోయినా ‘మేడమ్’ దగ్గర మార్కులతో కేంద్ర మంత్రి అయిన జేడీ శీలం...ఈ ముగ్గురూ జిల్లాతో అనుబంధం ఉన్నవారే.
కానీ తెలుగుజాతి తీవ్ర సంక్షోభంలో ఉన్న సమయంలో...తమ ప్రాంత ప్రజల భవిష్యత్తుతో ఆటలాడుకునే నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంటున్న తరుణంలో మౌనముద్ర దాల్చారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చీల్చేందుకు అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుండటాన్ని జీర్ణించుకోలేని ప్రజలు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపిస్తున్న తరుణంలో..సోమవారం జరిగిన పార్లమెంటు సమావేశంలో సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర ఎంపీలంతా పోరాటం చేస్తుంటే ఆ కేంద్ర మంత్రులు ముగ్గురూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అసలు తమకు సంబంధం లేని విషయంలా ఉండిపోయారు. దీనిపై ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. పదవులపై వ్యామోహంతో..మేడమ్ సోనియాను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారే తప్ప..ఓట్లు వేసిన ప్రజల పక్షాన నిలబడేందుకు ముందుకు రాకపోవడంపై జనం మండిపడుతున్నారు. బాపట్ల పార్లమెంట్ పరిధిలో పనబాక లక్ష్మిని అడుగుపెట్టనీయమని, మళ్లీ పోటీ చేస్తే తరిమి కొడతామని ఈ ప్రాంత ప్రజలు హెచ్చరిస్తున్నారు. జేడీ శీలం, పురందేశ్వరి కూడా సమైక్యాంధ్ర విషయంలో వెనకడుగు వేస్తున్నారని, రాష్ట్రాన్ని ముక్కలు చేసినా..అధిష్టానం కనుసన్నల్లోనే తాముంటామన్నట్లు వ్యవహరిస్తున్నారని, దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేస్తున్నారు.