కాకినాడ సిటీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు దాటవేత వైఖరి అవలంబిస్తున్న బీజేపీ నేతలకి రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు, ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ కారెం శివాజీ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బీజేపీ నాయకులను తిరగనీయకుండా చేస్తామని హెచ్చరించారు.
బలిదానాలు చేసుకోవద్దని, పోరాటాల ద్వారా ప్రత్యేక హోదా సాధించుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ, సీపీఐ, ప్రత్యేక హోదా సమితి పోరాడుతున్నాయన్నారు. ఈ నెల 11న తలపెట్టిన బంద్‌కు సీపీఎం, టీడీపీలు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగ సంఘాలు, జర్నలిస్టులు కూడా బంద్‌లో పాల్గొనాలని కోరారు.
రాజధాని నిర్మాణం కాగితాలకే పరిమితం..
రాజధాని నిర్మాణం కాగితాలకే పరిమితమైందని శివాజీ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఐదుశాతం కూడా జరగలేదన్నారు. పోలవరం, రాజధాని, పెట్రో కారిడార్, పెట్రో యూనివర్సిటీలను యుద్ధప్రాతిపదికన నిర్మించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదని, యూనివర్సిటీలకు శంకుస్థాపనలు చేసినా ఎక్కడా ప్రారంభోత్సవానికి నోచుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడమే కాక రైతులకు గిట్టుబాటు ధర లేదన్నారు. తక్షణం వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.