సంక్షేమ పథకాల కుదింపు సర్వే
టీవీ, ఫ్రిడ్జ్ ఉంటే పేదలు కానట్లే
సాధికార సర్వేలో ఇదే ‘లోగుట్టు’...!
వివరాలు చెప్పడానికి జనం నిరాకరణ
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలనుంచి తప్పించుకోవడానికే టీడీపీ సర్కారు సాధికార సర్వే చేయిస్తోందా..? సంక్షేమ పథకాలను కొందరికే పరిమితం చేయడానికి ప్రణాళిక వేసిందా..? ఇంట్లో టీవీ, రిఫ్రిజిరేటర్లు ఉండే కుంటుంబాలు ప్రభుత్వం దృష్టిలో సంపన్న కుటుంబాలా..? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలు వస్తున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెబుతున్న ప్రజాసాధికార సర్వే కొందరికే సాధికారికతను చేకూర్చేలా ఉందనే విమర్శలను తెచ్చిపెడుతోంది.
చిత్తూరు (అర్బన్): కుటుంబ ఆదాయ వనరులు, ఆర్థిక పరిస్థితులు, పథకాల ద్వారా పొందుతున్న లబ్ధిదారులు..తదితర లెక్కలు సేకరించడానికే ప్రజాసాధికారత సర్వే (స్మార్ట్ పల్స్ సర్వే) నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 13 లక్షల కుటుంబాలను 2,745 బ్లాకులుగా విభవించారు. ఒక్కో బ్లాకుకు ఎన్యుమరేటరును నియమించారు. సర్వే తీరును పరిశీలించడానికి 317 మందిని అదనంగా నియమించారు. ఆరు వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇందుకోసం పనిచేస్తున్నారు. ఈనెల 6 నుంచి ప్రారంభమయ్యింది. వారం రోజుల్లో అధికారులు పూర్తిచేసిన బ్లాకులు రెండంకెలు కూడా దాటలేదు. సీఎం డాష్ బోర్డులో చిత్తూరు జిల్లా నుంచి యాభై బ్లాకులు కూడా పూర్తి చేయలేదనే సమాచారం కనిపిస్తోందని సర్వే చేస్తున్న అధికారులపై, పర్యవేక్షకులు రోజూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక లోపాలున్నప్పటికీ చాలా చోట్ల ప్రజలు వ్యక్తిగత వివరాలు చెప్పడానికి నిరాకరించడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఆ వివరాలు ఎందుకో..
సర్వేలో ప్రతి కుటుంబంలోని వ్యక్తిని ఫొటో తీయాలి. ఇంటిని ఫోటో తీసి జియో ట్యాగింగ్ చేయాలి. టీవీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్, ఏసీ, హీటర్, సెల్‌ఫోన్, సైకిల్, స్కూటర్ వివరాలు తప్పనిసరిగా తెలియచేయాల్సి ఉంటుంది. కులాల వివరాలు సైతం చెప్పాలి. దారిద్య్రరేఖకు దిగువగా (బీపీఎల్), దారిద్య్ర రేఖకు ఎగువగా (ఏపీఎల్) ఉన్న కుటుంబాలుగా ప్రజల్ని విభజించడమే సర్వే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. టీవీ, రిఫ్రిజిరేటర్ ఆధారంగా ప్రజల్ని బీపీఎల్, ఏపీఎల్‌గా విడగొట్టడం ద్వారా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కొందరికే చేకూర్చాలన్నదని ప్రభుత్వ ఉద్దేశంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సర్వేలో కులాల ప్రస్తావన ఉండటం వెనుక కాపులను బీసీల్లో చేరస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు ముద్రగడ దీక్ష నేపథ్యంలో ఏర్పాటు చేసిన మంజునాథ కమిషన్‌కు సాధికార సర్వేలో కులాల వారీగా తీసిన వివరాలను ఇవ్వనున్నట్లు స్పష్టమవుతోంది. ఎలాంటి ప్రామాణికం లేకుండా చేస్తున్న సర్వేలో కాపుల సంఖ్యను తక్కువగా చూపిస్తూ బీసీల్లో చేర్చడానికి వీల్లేదనే విధంగా కొత్త అంశాన్ని తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
‘సర్వే’జనా.. ‘దుఖమే’ భవిష్యత్తు
Published Wed, Jul 13 2016 12:58 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement
Advertisement