
భక్తుల ప్రాణాలకు భరోసా ఏదీ?
తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు వాహనాల్లో వెళ్తుంటారు...
- అలిపిరి టోల్‌గేట్‌లో తనిఖీలు తూచ్
- లంచాల మత్తులో సెక్యూరిటీ సిబ్బంది
- గాల్లో భక్తుల ప్రాణాలు
- ‘ధవళేశ్వరం’ ఘటనే దీనికి నిదర్శనం
అలిపిరి టోల్‌గేట్ సిబ్బంది వాహన తనిఖీలను గాలికొదిలేస్తున్నారు. లంచావతారమెత్తి భక్తుల ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నారు. వాహనం ఫిట్టా.. ఫట్టా.. పట్టించుకోకుండానే లంచాలిస్తే రైట్..రైట్ చెప్పేస్తున్నారు. ఆ శ్రీనివాసుడి భక్తులకే శఠగోపం పెట్టేస్తున్నారు. ‘ధవళేశ్వరం’ ఘటనే దీనికి నిలువెత్తు నిదర్శనం..
తిరుపతి అర్బన్: తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు వాహనాల్లో వెళ్తుంటారు. టీటీడీ నిబంధనల ప్రకారం అలిపిరి టోల్‌గేట్ వద్దకు చేరుకునే ప్రతి వాహనాన్ని సెక్యూరిటీ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఘాట్‌రోడ్డులోకి అనుమతివ్వాల్సి ఉంటుంది. అందులో భాగంగా వాహనం సామర్థ్యాన్ని బట్టి ప్రయాణికుల సంఖ్య, వాహనం డ్రైవర్ స్థితిగతులు, డ్రైవింగ్ లెసైన్స్, వాహనం ఫిట్‌నెస్ వంటి అంశాలను కచ్చితంగా పరిశీలించాలి. కానీ అలిపిరి వద్ద పనిచేస్తున్న 80 శాతం సెక్యూరిటీ సిబ్బంది మామూళ్లకు అలవాటై తనిఖీలను గాలికొదిలేస్తున్నారు. కొందరు మద్యం మత్తులో తూగుతుండగా మరికొందరు తమకు ఇష్టం వచ్చిన వారి వాహనాలను ఏమాత్రం తనిఖీలు చేయకుండా ఘాట్‌లోకి అనుమతిస్తున్నారు. కనీసం గేట్‌పాస్ కూడా తీసుకోకుండా తిరుమల కొండ ఎక్కిస్తున్నారు.
గాల్లో భక్తుల ప్రాణాలు
తిరుమల కొండ అత్యంత ప్రమాదకర మలుపులు కలిగిన కొండ. వాహనాల ఫిట్‌నెస్‌తోపాటు డ్రైవర్లు ఎంతో అనుభవంతో చాకచక్యంగా వ్యవహరిస్తేగానీ కొండ ఎక్కడం కష్టం. భక్తులకు ఎలాంటి ప్రమాదాలు వాటిల్లకుండా టీటీడీ అలిపిరిలో టోల్‌గేట్ ఏర్పాటు చేసింది. ఇక్కడ ప్రతి వాహనాన్నీ తనిఖీ చేయాల్సి ఉంది. అయితే స్థానిక సిబ్బంది లంచాల మత్తులో వాహన తనిఖీలను గాలికొదిలేస్తున్నారు. ఫలితంగా భక్తుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం మోసాయిపేటకుచెందిన 23 మంది భక్తులు తీర్థయాత్రల కోసమని ఈనెల 6న తమ సొంత వాహనం(తుఫాన్)లో బయలుదేరారు. భద్రాచలం, శ్రీశైలం ఆలయాలను దర్శించుకని ఈ నెల 7 తిరుమలకు బయలుదేరారు.
సాధారణంగా ఈ వాహనంలో 13 మంది మాత్రమే ప్రయాణించాల్సి ఉంది. కానీ ఓవర్ లోడ్డుతో శ్రీవారి దర్శనం కోసం అలిపిరి వద్దకు చేరారు. కానీ ఇక్కడి సిబ్బంది తనిఖీలు చేయకుండా లంచాలు తీసుకుని ఘట్‌రోడ్డులోకి అనుమతించారు. ఆపై ఈనెల 9న తిరుగు ప్రయాణంలో ఇదే పరిస్థితి. ఓవర్‌లోడ్డుతో వెళ్లడం.. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీపై నుంచి బోల్తా కొట్టింది. 22 మంది మృత్యువాత పడ్డారు. తనిఖీలు చేసి ఉంటే భక్తులు ఇతర వాహనాల్లో వెళ్లేవారని.. ప్రమాదం జరిగి ఉండేది కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ విభాగంలో మార్పులు వచ్చి యాత్రికుల ప్రాణాలకు భరోసా ఉండే చర్యలు తీసుకుంటారోలేదో చూడాల్సి ఉంది.