
కలెక్టర్ రేవు ముత్యాలరాజు
సాక్షి, ఏలూరు (పశ్చిమగోదావరి) : జిల్లాలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మంజూరు చేసే ప్రోత్సాహకాల విషయంలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రేవు ముత్యాలరాజు హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్‌లో మంగళవారం సాయంత్రం నిర్వహించిన జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపనకు అందించే ప్రోత్సాహకాలపై సమీక్షించారు. వచ్చిన దరఖాస్తులు, అందించిన రాయితీలపై ఆరా తీశారు. ఆయన అడిగిన ప్రశ్నలకు అధికారులు సరైన సమాధానం చెప్పలేకపోవడంతో కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పూర్తి వివరాలను పరిశీలనకు ఉంచాలని ఆదేశించారు. అవకతవకలు జరిగినట్టు రుజువైతే శాఖాపర చర్యలు తప్పవని హెచ్చరించారు.
పరిశ్రమల స్థాపన అనుమతుల కోసం వచ్చిన 21 దరఖాస్తులను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ మురళీమోహన్, ఏసుదాసు, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ మోహనరావు, సాంఘిక సంక్షేమ శాఖ డిడి లక్ష్మీదేవి, పొల్యూషన్ కంట్రోల్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
మున్సిపల్ కమిషనర్లకు షోకాజ్ నోటీసులు !
జిల్లాలో ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించడంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం సాయంత్రం కాలుష్య నియంత్రణ మండలి సమావేశంలో జిల్లాలో సంపూర్ణ ఆరోగ్యం, ప్లాస్టిక్ వినియోగం తదితర అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ తదితర అంశాలపై ఆరా తీశారు. కొల్లేరు ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమావేశానికి మున్సిపల్ కమిషనర్లు హాజరు కాకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుబ్రహ్మణ్యేశ్వరి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment