అబ్బా..ఇది ఏమి దోమ
* దోమల నివారణకు ‘పశ్చిమ’ వాసుల నెల ఖర్చు రూ.10 కోట్లు
* వైద్య ఖర్చులు దీనికి 10 రెట్లు అధికం
* అయినా జనం రక్తాన్ని పీల్చేస్తున్న మశకాలు
తాడేపల్లిగూడెం : ఎండా.. వాన.. చలి.. రాత్రి.. పగలు అనే తేడా లేకుండా దోమలు జనాన్ని కుట్టి కుట్టి ఆసుపత్రుల పాలు చేస్తున్నాయి. వీటి తీవ్రత ఎంతగా ఉందంటే.. పగటిపూట కూడా మస్కిటో రిపెల్లెంట్స్, మేట్స్, కాయిల్స్ ఉపయోగించాల్సిన స్థాయిలో మశకాలు విజృం భిస్తున్నాయి. ఈ సమస్య దోమలగూడెంగా ప్రసిద్ధికెక్కిన తాడేపల్లిగూడెం పట్టణానికి మాత్రమే పరిమితం కాలేదు. ఏలూరు నగరం, భీమవరం, నరసాపురం, పాల కొల్లు, తణుకు, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం పట్టణాలతోపాటు ప్రతి గ్రామంలోనూ ప్రజలను వేధిస్తున్నాయి.
వీటివల్ల వైరల్, టైఫాయిడ్ జ్వరాలు సోకుతున్నాయి. సకాలంలో వైద్యం చేయించుకోకపోతే కిడ్నీలు దెబ్బతిని ప్రాణాపాయ స్థితి సంభవిస్తోంది. ప్రతి కుటుంబంలోనూ ఒక్కరైనా జ్వరం బారిన పడుతున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అవగతం చేసుకోవచ్చు. రక్తంలో ప్లేట్‌లెట్స్ పడిపోయి జ్వర పీడితులు ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్న సందర్భాలు అనేకం ఉంటున్నాయి. వేరే వ్యక్తుల నుంచి ప్లేట్‌లెట్స్ దానంగా తీసుకుని.. వైద్య ఖర్చుల కోసం వేలాది రూపాయలు వెచ్చించి ప్రాణాలు నిలబెట్టుకుంటున్న వారెందరో ఉన్నారు.
నెల బడ్జెట్ రూ.10 కోట్లు
జిల్లా జనాభా 39 లక్షల 34 వేల 782. కుటుంబాల పరంగా చూస్తే జిల్లాలో మొత్తం 10 లక్షల 91 వేల 525 కుటుంబాలున్నాయి. జిల్లాలోని ప్రతి కుటుం బం దోమల నివారణకు మస్కిటో రిపెల్లెంట్, మేట్స్, కాయిల్స్‌లో ఏదో ఒకటి విధిగా వాడుతోంది. అధిక శాతం కుటుం బాల్లో గదికి ఒకటి చొప్పున వీటిని వాడుతున్నారు. కొందరైతే పగలు, రాత్రి కూడా వీటిని వెలిగిస్తున్నారు.
ప్రతి కుటుంబం రోజుకు ఒక రిపెల్లెంట్ లేదా ఒక కాయిల్ చొప్పున మాత్రమే వాడుతున్నట్టు భావిస్తే నెలకు రూ.90 చొప్పున వెచ్చించాల్సి వస్తోంది. రిపెల్లెంట్ (లిక్విడ్) వాడకానికి అయితే రూ.70 నుంచి రూ.120 వరకూ ఖర్చవుతోంది. ఎవరు ఏది వాడుతున్నా నెలకు సగటు ఖర్చు రూ.90 చొప్పున లెక్కిస్తే.. మొత్తం కుటుంబాలు దోమల నివారణకు నెలకు రూ.9,85,97,250 ఖర్చు చేస్తున్నాయి. వాస్తవ పరిస్థితుల ఆధారంగా చూస్తే ఈ ఖర్చు ఇంతకంటే ఎక్కువే.
కుదేలవుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాలు
దోమల ప్రభావం పేద, మధ్య తరగతి ప్రజల ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతున్నారుు. దోమల వల్ల అనారోగ్యానికి గురవుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాలు మంచాన పడటంతో పనులకు వెళ్లలేకపోతున్నారు. దీనివల్ల పూట గడవటం కష్టంగా మారుతోంది. మరోవైపు వైద్య ఖర్చుల కోసం అప్పుల పాలవుతున్నారు. దీని ప్రభావం పైకి సాదాసీదా విషయంగానే కనిపిస్తున్నప్పటికీ.. ఎన్నో కుటుం బాల జీవన పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ఎన్నో కుటుం బాలను కుదేలు చేస్తున్నాయి.
దిగజారిన పారిశుధ్యం
పారిశుధ్య నిర్వహణకు నిధులు లేవంటూ మునిసిపాలిటీలు చేతులెత్తేస్తున్నాయి. ఎక్కడ చూసినా ఖాళీ జాగాలు, వాటినిండా పిచ్చి మొక్కలు, మురికి గుంటలు దర్శనమిస్తున్నాయి. అవన్నీ దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారాయి. మురుగు కాలువల్లో దోమల లార్వాను నివారించే బెటైక్స్ వంటి మందులను మునిసిపాలిటీలు పిచికారీ చేయడం లేదు. దోమల నివారణకు ఫాగింగ్ చేయడం లేదు. ఫలితంగా దోమలు కుప్పలు తెప్పలుగా పెరుగుతూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో.. మరీ ముఖ్యంగా మునిసిపల్ కార్యాలయూల్లో సైతం పగటి పూట దోమల నివారణకు రిపెల్లెంట్స్, మేట్స్ వంటివి వాడుతున్నారు.
మునిసిపాలిటీలు ఏం చేయూలి
పారిశుధ్య పరిరక్షణకు కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నట్టు మునిసిపాలిటీలు గణాంకాల్లో పేర్కొంటున్నప్పటికీ.. దోమల సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. దోమలను గుడ్డు దశ నుంచి లార్వా.. ఆ తరువాత దశల్లో నివారించేందుకు ప్రతి నిత్యం చర్యలు చేపట్టాల్సి ఉంది. డ్రెయిన్లలో గుడ్లు, లార్వాలు దోమలుగా వృద్ధి చెందకుండా ఆయిల్ బాల్స్ వేయాలి.
వీటిని వేయడం వల్ల నీటిపై ఆయిల్ తెట్టు కడుతుంది. తద్వారా లార్వా ఊపిరి అందక చనిపోతుంది. గుడ్లు లార్వాలుగా అభివృద్ధి చెందవు. గంబూషియా చేపలను తరచూ మురుగు కాలువలలో వదలాలి. ఇవి దోమల లార్వాలను తినేస్తుంటాయి. ఈ పనులు చాలాచోట్ల ప్రహసనంలా మారడంతో దోమల నివారణ ఎండమావిలా మారిందనే విమర్శలు ఉన్నాయి.