కాంట్రాక్టు లెక్చరర్ల ఆందోళనకు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు మద్దతు
అధికారంలోకి వస్తే సర్వీసులు క్రమబద్ధీకరిస్తామని అప్పట్లో హామీ
మంత్రివర్గ కమిటీని వేసి చేతులు దులుపుకున్న వైనం
‘ఏళ్ల తరబడి ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లను వెంటనే పర్మినెంట్ చేయాలి.. వారిని తొలగించాలని చూస్తే తెలుగుదేశం పార్టీ తరఫున ఆందోళన చేపడ తాం.. ప్రభుత్వానికి బుద్ధిచెబుతాం.. ఉద్యోగ భద్రత కోసం ఆడబిడ్డలు రోడ్డెక్కడం దారుణం.. మేం అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థను రద్దు చేసి వీరందరినీ పర్మినెంట్ చేస్తాం..’- ప్రతిపక్ష నాయకుని హోదాలో చంద్రబాబునాయుడు నాలుగేళ్ల క్రితం 2012 ఫిబ్రవరి 4న రాజమండ్రిలో కాంట్రాక్టు మహిళా లెక్చరర్ల దీక్షా శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం పలికిన పలుకులివి. హామీ ఇచ్చిన రెండేళ్లకే ఆయన అధికారంలోకి వచ్చారు. సీఎం అయి రెండేళ్లవుతున్నా వీరి గోడు పట్టించుకోవడం మరిచారు.
విశాఖపట్నం: జాబు రావాలంటే బాబు రావాలన్న నినాదంతో నిరుద్యోగులతో పాటు రాష్ట్రంలోని 3750 మంది కాంట్రాక్టు లెక్చరర్లు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వీరిలో పీజీలు, పీహెచ్‌డీలు చేసిన వారున్నారు. బాబు వచ్చారు.. ఇక తమను రెగ్యులరైజ్ చేస్తారని ఈ కాంట్రాక్టు అధ్యాపకులు సంబరపడ్డారు. అయితే ఆయనొచ్చాక వారి జీవితాలు మరింత దుర్భరమయ్యాయి. వీరి ఆవేదనను, ఆందోళనలను పట్టించుకోలేదు. నెలనెలా ఇచ్చే జీతాలు మూడు నాలుగు నెలలకు కూడా ఇవ్వడం లేదు. దీంతో వీరి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులొచ్చాయి.
వాస్తవానికి పదహారేళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలోనే కాంట్రాక్టు లె క్చరర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. అప్పట్నుంచి ఇప్పటిదాకా వేలాది మంది తమ ఉద్యోగాలు ఎప్పుడైనా రెగ్యులరైజ్ కాకపోతాయా? అనే ఆశతో పనిచేస్తున్నారు. 2000లో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్లకిచ్చే బేసిక్ వేతనానికి అదనంగా రూ.4500 ఇచ్చేవారు. 2011 నుంచి దానిని రూ.18 వేలు చేశారు. 2014లో జూనియర్ లెక్చరర్ల మూలవేతనాన్ని కనీస వేతనంగా వీరికి చెల్లించాలని నిర్ణయించారు. 2015 పీఆర్‌సీ ప్రకారం వీరికి నెలకు రూ.37,100 చొప్పున వేతనం ఇవ్వాల్సి ఉంది. అయినా ఇప్పటికీ రూ.18 వేలే చెల్లిస్తోంది. అది కూడా మూడు నాలుగు నెలలకొకసారి ఇస్తోంది. గత డిసెంబర్ నుంచి ఇప్పటికీ వేతనాలివ్వలేదు. ఏడాది పొడవునా పనిచేస్తున్నా వీరికి పది నెలల జీతాలే ఇస్తారు. ఏప్రిల్, మే నెలల్లో వేసవి సెలవులకు వీరికి జీతాలుండవు. కానీ ఆ రెండు నెలలు కూడా వీరితో పరీక్షా పత్రాల మూల్యాంకనం, అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణ పనులు చేయిస్తుంటారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా రెగ్యులర్ లెక్చరర్లు సుమారు 2500 మంది ఉంటే ఈ కాంట్రాక్టు లెక్చరర్ల సంఖ్య 3750 వరకు ఉన్నారు.
కమిటీకి తీరికలేదు..
వీరి క్రమబద్ధీకరణ అంశంపై ప్రభుత్వం 2014 సెప్టెంబర్‌లో కేబినెట్ కమిటీని నియమించింది. ఇందులో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చైర్మన్‌గా, మంత్రులు గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాథరెడ్డి, కామినేని శ్రీనివాస్ సభ్యులుగా ఉన్నారు. నెల రోజుల్లో ఈ కమిటీ తమ నివేదికను సర్కారుకు సమర్పించాల్సి ఉంది. 18 నెలలవుతున్నా ఈ కమిటీ సభ్యులు ఒక్కసారీ సమావేశం కాలేదు.
ఉద్యోగ భద్రత కల్పించండి
తమను క్రమబద్ధీకరించడంపై సుప్రీంకోర్టులో అభ్యంతరాలున్నాయని ప్రభుత్వం చెబుతోంది.. అదే నిజమైతే బేసిక్‌తో పాటు డీఏ చెల్లించేలా అసెంబ్లీలో తీర్మానం చేసి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కాంట్రాక్టు లెక్చరర్లు డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారని చెబుతున్నారు. పొరుగున ఉన్న తెలంగాణలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లను జూన్‌లో క్రమబద్ధీకరిస్తున్నారు. గతంలో తమను క్రమబద్ధీకరిస్తామన్న హామీని చంద్రబాబు నెరవేర్చాలని వీరు కోరుతున్నారు.
హామీ ఏమైంది బాబూ?
Published Thu, Mar 17 2016 11:25 PM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement
Advertisement