
..ఇదేం బిల్లప్పా?
సాక్షి, అనంతపురం : జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖలో పనిచేస్తున్న ఓ అధికారి చేతివాటం ప్రదర్శించారు. కళాజాతాల పేరిట భారీ మొత్తంలో దండుకున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో సందట్లో సడేమియాగా పని కానిచ్చేశారు. రాజకీయ నాయకులతో సత్సంబంధాలు కల్గివుండే ఆ అధికారి..ప్రస్తుతం ఓ మంత్రికి పీఆర్‌ఓగా వెళ్లనున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ కలలు, అమ్మహస్తం, వడ్డీలేని రుణాలు, శ్రీనిధి, వ్యక్తిగత మరుగుదొడ్లు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన విషయం విదితమే. వీటిపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయడానికి ప్రభుత్వం భారీగానే నిధులు కేటాయించింది. ఇందులో భాగంగా జిల్లాలో కళాజాతాలు నిర్వహించే బాధ్యతను ఓ స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు. ఆ సంస్థతో కుమ్మక్కైన సదరు అధికారి బోగస్ బిల్లులు చేయడానికి రూ.లక్ష కమీషన్‌తో పాటు కళాకారులకు మంజూరైన నిధులను సైతం భారీగానే భోంచేసినట్లు తెలిసింది.
సమైక్య ఉద్యమంలో సడేమియా..
జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి 7 నుంచి 19 వరకు సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగింది. ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులతో పాటు ప్రజలందరూ ఉద్యమంలో పాల్గొన్నారు.
ఇదే సమయంలో 14 కళాజాత బృందాలు జిల్లా వ్యాప్తంగా 12 రోజుల పాటు ప్రభుత్వ పథకాలపై ప్రచారం నిర్వహించినట్లు ఆ అధికారి ధ్రువీకరించారు. ముఖ్యంగా ప్రకటనలు, ప్రచార కార్యక్రమాల కోసం ప్రభుత్వం కేటాయించిన నిధులు మార్చి నాటికి ల్యాప్స్ అయ్యే అవకాశం ఉండటంతో వాటిని ఎలాగైనా కాజేయాలనుకున్న ఆ అధికారికి కళాజాతాలు కలసొచ్చాయి.
జిల్లాలో కళాకారుల బృందాలు 14 ఉన్నాయి. ఒక్కో బృందంలో ఐదుగురు కళాకారులు ఉన్నారు. వీరు ఏజెన్సీ తరఫున ప్రభుత్వ పథకాలపై ప్రచారం నిర్వహిస్తుంటారు. ఒక్కో కార్యక్రమానికి ప్రభుత్వం రూ.12 వేల చొప్పున ఏజెన్సీకి చెల్లిస్తుంది. ఇందులో ఒక్కో కళాకారుడికి రూ.600 చొప్పున.. ఒక్కో కార్యక్రమానికి రూ.3 వేలు చెల్లించాలి. మిగిలిన రూ.9 వేలలో వాహనం, డీజిల్ ఖర్చు, ఎల్‌సీడీ ప్రొజెక్టర్, జనరేటర్ అద్దె పోను మిగిలినది ఏజెన్సీకి మిగులుతుంది.
పభుత్వ పథకాలపై కళాజాతాలకు సమైక్య ఉద్యమం సమయంలో బ్రేక్ పడింది. అయితే.. ఆ అధికారి తనకు రూ.లక్ష ఇస్తే ఫిబ్రవరిలో కళాజాతాలు నిర్వహించినట్లు ధ్రువీకరణ పత్రం ఇస్తానని ఏజెన్సీకి సూచించారు. ఏజెన్సీ ఆ మొత్తాన్ని ముట్టజెప్పి బిల్లులు అప్పనంగా స్వాహా చేసినట్లు తెలిసింది. ఫిబ్రవరి 7 నుంచి 19 వరకు జిల్లాలోని 14 కళాకారుల బృందాలు దాదాపు 210 గ్రామాల్లో కళాజాతాలు నిర్వహించినట్లు ఆ అధికారి ధ్రువీకరించారు. ఇందుకు గానూ ఒక్కో కళాజాతాకు రూ.12 వేల చొప్పున రూ.25.20 లక్షల మంజూరు కోసం ప్రభుత్వానికి నివేదించారు. తద్వారా ఆ అధికారి, ఏజెన్సీ నిర్వాహకులు కలిసి స్వాహా పర్వానికి తెర లేపారు.
ఎల్‌ఈడీ టీవీ ఏమైనట్లు?
మీడియా సెంటర్‌లోని అన్ని వస్తువులు ఆయా కార్యాలయాలకు చేరుకోగా, హడావిడిగా కొనుగోలు చేసిన ఎల్‌ఈడీ టీవీ మాత్రం ఏమైందన్నది ప్రశ్నార్థకంగా మారింది.
గతంలో సైతం ఆ అధికారి ఇలాంటి తప్పులే చేశారు. అనిల్‌కుమార్ జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు పలు ఫిర్యాదులు అందాయి. పద్ధతి మార్చుకోకపోతే విధుల నుంచి సస్పెండ్ చేస్తానని అప్పట్లో ఆయన హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో బిత్తరపోయిన ఆ అధికారి అప్పట్లో విధులకు సెలవు పెట్టి వెళ్లిపోయారు.
బిల్లు పెట్టింది వాస్తవమే
ఒక్క రోజు మీడియా సెంటర్ నిర్వహణకు రూ.2.50 లక్షలు, ఫిబ్రవరిలో కళాజాతాలు నిర్వహించినట్లు అధికారి బిల్లులు పెట్టింది వాస్తవమేనని సమాచార శాఖ ఏడీ వై.వెంకటేశ్వర్లు చెప్పారు. నిర్వహించని జాతాలకు బిల్లు పెట్టిన వైనంపై ‘సాక్షి’ ఆయన్ను సంప్రదించగా పై విధంగా సమాధానమిచ్చారు. ఈ విషయంపై ఉన్నతాధికారుల సూచనల మేరకు నడుచుకుంటామని చెప్పారు.