ఏమిటీ రైటాఫ్ | What raitaph | Sakshi
Sakshi News home page

ఏమిటీ రైటాఫ్

Published Wed, Mar 25 2015 3:20 AM | Last Updated on Sat, Sep 2 2017 11:19 PM

What raitaph

సాక్షి, విశాఖపట్నం:  పేరుకుపోయిన మొండిబకాయిలను అడ్డగోలుగా మాఫీ చేసేందుకు సభ్యుల ఆమోదం కోసం అజెండాలో ప్రతిపాదించిన అంశంపై డీసీసీబీ మహాజనసభ అట్టుడికి పోయింది. రూ. 3.95కోట్ల వరకు ఉన్న మొండి బకాయిలు వడ్డీతో కలుపుకుంటే  రూ.20 కోట్లకు పైగా ఉంటాయని...వీటి వసూలుకు చర్యలు చేపట్టాల్సింది పోయి టెక్నికల్ రైటాఫ్ పేరుతో మాఫీకి యత్నించడం ఎంతవరకు సమంజసమంటూ పలువురు సభ్యులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

‘దా‘రుణం’గా మాఫీ’ శీర్షకన మంగళవారం సాక్షిలో వచ్చిన  కథనం మహాజనసభను కుదిపేసింది. అజెండాలో చేర్చిన ఈ అంశంపై వివరణ ఇవ్వాల్సిందేనని, తక్షణమే మాఫీ ప్రయత్నాలు ఆపి వసూలుకు చర్యలుచేపట్టాలని డిమాండ్ చేస్తూ మెజార్టీ సభ్యులు డిమాండ్ చేశారు.

ఈ అంశంపై సభలో వాడివేడిగా చర్చ జరుగుతుందని ముందుగానే ఊహించిన సహకార శాఖాధికారులు గైర్హాజరయ్యారు. డీసీసీబీ చైర్మన్ సుకుమార్ వర్మ అధ్యక్షతన జరిగిన 42వ మహాజనసభ ప్రారంభం కాగానే డెరైక్టర్ గనగళ్ల వివేక్ అజెండాలో 8వ అంశంగా చేర్చిన ఈ టెక్నికల్ రైటాఫ్ అంశాన్ని ప్రస్తావించారు. పాలకవర్గం ఆమోదం మేరకే మహాజనసభలో ప్రవేశపెడుతున్నామని అధికారులు చెబుతున్నారని, కానీ వాస్తవంగా 16న తేదీన బోర్డు మీటింగ్ జరిగింది.. 23వ తేదీన పాలకవలర్గ సమావేశం జరిగింది.. కానీ ఈ మహా జనసభ కోసం 9వ తేదీనే నోటీసు సర్వ్ చేశారు..అంటే బోర్డులో కానీ, పాలకవర్గ సమావేశంలో కానీ చర్చించకుండానే పాలకవర్గం ఆమోదంతో అంటూ అజెండాలో ఏ విధంగా ఈ అంశాన్ని చేర్చారని ప్రశ్నించారు.

సమాధానం చెప్పేందుకు సీఈవో అట్లూరి వీరబాబు కొద్ది సేపు ఇబ్బందిపడ్డారు. ఎన్‌పీఏ తగ్గించుకునేందుకు టెక్నికల్ రైటాఫ్ చేయడం ఎంతవరకు సమంజసమని వివేక్ ప్రశ్నించారు. ల్యాండ్‌మార్ట్‌గేజ్ కింద ఇచ్చిన రుణాలకు తనఖా పెట్టిన డాక్యుమెంట్లు కనిపించడంలేదనే సాకుతో వాటిని రైటాఫ్‌కు యత్నించడం సరికాదన్నారు. పాలకవర్గం ఏర్పడి ఏడాది కావస్తోంది.

ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఈ బకాయిలపై సమీక్షలు చేసిన పాపన పోలేదు.. వసూలు కోసం కనీసం ప్రయత్నించలేదంటూ మరి కొందరు సభ్యులు సభలో ప్రస్తావించారు. రికవరీ చేయలేని అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని.. కనీసం ఆర్‌ఆర్ యాక్టుకింద వారి జీతభత్యాల నుంచి ఎందుకు రికవరీ చేయలేదని ప్రశ్నించారు. ఇప్పుడు రికార్డులు పోయాయి..అప్పులిచ్చిన అధికారుల్లేరు అంటూ కుంటిసాకులు చెప్పడం సరికాదన్నారు.
 
సూపర్‌బజార్ అప్పు ఏ విధంగా మాఫీ చేస్తారు?
సూపర్‌బజార్‌కు ఇచ్చిన రూ.26 లక్షల రుణం వడ్డీతో కలుపుకుంటే రెండుకోట్లకు పైగా ఉంటుందని, వందకోట్లకుపైగా టర్నోవర్‌తో లాభాల బాటలో దూసుకెళ్తున్న ఈ సంస్థ నుంచి అప్పులు వసూలుకావడం లేదంటే సిగ్గుచేటని..ఈ అప్పును రైటాఫ్ చే యాలని నిర్ణయించడం సరికాదని వివేక్‌తో పాటు డెరైక్టర్లు సాయం రమేష్, దుడ్డు సన్యాసినాయుడులు ధ్వజమెత్తారు. మిగిలిన రుణాల సంగతి ఎలా ఉన్నా సూపర్ బజార్‌విషయంలో తామంతా అభ్యంతరం వ్యక్తంచేస్తున్నామంటూ సభ్యులంతా ముక్తకంఠంతో తేల్చిచెప్పారు. తక్షణం ఈ అంశాన్ని అజెండా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

డీసీఎంఎస్ అప్పు సంగతేంటి?
డీసీఎంఎస్‌కు డీసీసీబీ ఇచ్చిన రుణాల సంగతేమిటని డీసీఎంఎస్ చైర్మన్ ఎం.మహాలక్ష్మీ నాయుడు, డెరైక్టర్ దండి సన్యాసిదొర(బాల)లు ప్రశ్నించారు. మాకు ఇచ్చిన రుణాలను కూడా మాఫీ చేస్తామంటేనే అజెండాలో చేర్చిన టెక్నికల్ రైటాఫ్‌కు అంగీకరిస్తామని తేల్చి చెప్పారు. అయినప్పటికీ లాభాల బాటలో ఉన్న సూపర్‌బజార్‌కు ఇచ్చిన అప్పులను టెక్నికల్ ైరైటాఫ్ చేస్తామంటే మాత్రం ఊరుకోబోమని తేల్చిచెప్పారు. డీసీఎంఎస్‌కు ఇచ్చిన అప్పులను కూడా మాఫీ చేసితీరాల్సిందేనని పట్టుబట్టారు. కాగా టెక్నికల్ రైటాఫ్ అంశాన్ని తొలిగించాలని మెజార్టీ సభ్యులంతా డిమాండ్ చేశారు.
 
రూపాయి కూడా మాఫీ కాదుః చైర్మన్
టెక్నికల్ రైటాఫ్ అంటే రికార్డ్స్‌లో టెక్నికల్‌గా ఆ అప్పుల లిస్ట్‌ను తొలగించడమే తప్ప.. వాటిని మాఫీ చేసినట్టు కాదని డీసీసీబీ చైర్మన్ సుకుమార్‌వర్మ స్పష్టం చేశారు. ఇచ్చిన అప్పు కాదుకదా..కనీసం దానిపై వడ్డీ కూడా మాఫీ చేసే అధికారం మాకు లేదని.. వాణిజ్యబ్యాంకుల మాదిరిగానే రికార్డుల కోసమే టెక్నికల్ రైటాఫ్ అంశాన్ని చేర్చామని ఆయన వివరణ ఇచ్చారు. సభ్యులంతా వ్యతిరేకిస్తున్నందున సూపర్ బజార్ అంశాన్ని టెక్నికల్ రైటాఫ్ జాబితా నుంచి తొలగిస్తామన్నారు. అనంతరం ఇతర అంశాలన్నీ ఏకగ్రీవంగా మహాజనసభ ఆమోదించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement