కేంద్ర ప్రభుత్వం ప్రమోట్ చేసిన జాతీయ ఆస్తుల పునర్‌నిర్మాణ కంపెనీ(ఎన్‌ఏఆర్‌సీఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24)లో మరిన్ని మొండి రుణాల కొనుగోలుకి ప్రణాళికలు వేస్తోంది. ఇందుకు సుమారు 300 కంపెనీల నుంచి రూ. 3 లక్షల కోట్ల రుణాల జాబితా సిద్ధంగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. బ్యాడ్ బ్యాంక్‌గా పిలిచే ఎన్‌ఏఆర్‌సీఎల్ గతేడాది(2022–23) రూ. 50,000 కోట్ల మొండి రుణాలను సొంతం చేసుకోవాలనే లక్ష్యం విధించుకున్నప్పటికీ రూ. 10,378 కోట్ల రుణాలను మాత్రమే కొనుగోలు చేయగలిగింది. వివరాలు చూద్దాం..
ముంబై: గత ఆర్థిక సంవత్సరంలో బ్యాడ్ బ్యాంక్ తొలుత పెట్టుకున్న భారీ లక్ష్య సాధనలో విఫలమైనప్పటికీ ఈ ఏడాది మరింత వేగంగా ముందుకు సాగాలని భావిస్తోంది. కొన్ని ప్రాథమిక అవాంతారాలు లక్ష్య సాధనలో అడ్డు తగిలినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది మరింత పటిష్టంగా రుణ కొనుగోలు చేపట్టాలని చూస్తోంది. నిజానికి 300 కంపెనీల నుంచి మొత్తం రూ. 3 లక్షల కోట్ల మొండి రుణాలు నమోదైనట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే ముందుగా విక్రయించాల్సిన మొండి ఖాతాలను గుర్తించమంటూ ఈ నెల మొదట్లో ఆర్థిక శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పీఎస్‌యూ బ్యాంకులు ఎన్‌ఏఆర్‌సీఎల్‌కు పలు మొండి ఖాతాలను ఆఫర్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. వీటి ప్రకారం విక్రయానికి సిద్ధమైన జాబితా నుంచి 20–25 శాతం ఖాతాలను బ్యాడ్ బ్యాంక్ కొనుగోలు చేయనుంది.
జాబితా పెద్దదే..
ఈ ఏడాది విక్రయానికి సిద్ధంకానున్న మొండి ఖాతాల జాబితాలో వీడియోకాన్ ఇండస్ట్రీస్, ఫ్యూచర్ రిటైల్, ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్, జీటీఎల్, వీసా స్టీల్, క్వాలిటీ, గాయత్రి ప్రాజెక్ట్స్, ఎరా ఇన్‌ఫ్రా, రీడ్ అండ్ టేలర్ ఇండియా, కోస్టల్ ఎనర్జెన్ తదితరాలున్నాయి. కాగా.. ఇటీవల విదర్భ ఇండస్ట్రీస్(రూ. 1,150 కోట్లు), రోల్టా(రూ. 600 కోట్లు), వీవోవీఎల్(రూ. 1,100 కోట్లు) ఖాతాలను ప్రభుత్వ బ్యాంకులు బ్యాడ్ బ్యాంకుకు ఆఫర్ చేశాయి. ఈ బాటలో ధరణి షుగర్స్ ఖాతా(రూ. 619 కోట్లు)ను దాదాపు రూ. 223 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదేవిధంగా రెయిన్‌బో పేపర్స్ రూ. 1,136 కోట్ల రుణాలకుగాను ఎన్‌ఏఆర్‌సీఎల్ రూ. 87 కోట్ల యాంకర్ ఆఫర్ చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
గతేడాది ఇలా..
2022–23లో జేపీ ఇన్‌ఫ్రాటెక్, ఎస్‌ఎస్‌ఏ ఇంటర్నేషనల్, హీలియోస్ ఫొటో వోల్టాయిక్‌కు చెందిన మొత్తం రూ. 10,378 కోట్ల రుణాలను ఎన్‌ఏఆర్‌సీఎల్ చేజిక్కించుకుంది. ఇందుకు నగదు, సెక్యూరిటీల జారీ ద్వారా రూ. 3,636 కోట్లు ఆఫర్ చేసింది. కాగా.. కొన్ని రుణాల విషయంలో ఎన్‌ఏఆర్‌సీఎల్ ఆఫర్లను రుణదాతలు తిరస్కరిస్తున్నాయి. మరికొన్ని కేసుల్లో మరింత మెరుగైన ఆఫర్లు లభిస్తున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు వివరించాయి.
జీటీఎల్‌కు బ్యాడ్ బ్యాంకు ప్రతిపాదిత రూ. 360 కోట్ల ఆఫర్ అంచనాలను చేరకపోవడంతో తిరస్కరణకు గురైంది. రుణదాతలు రూ. 550 కోట్లు ఆశించడం గమనార్హం! ఇక మెక్‌నల్లీ భారత్ విషయంలో నాల్వా స్టీల్ రూ. 424 కోట్లకుపైగా ఆఫర్ చేసింది. ఇదేవిధంగా మిట్టల్ కార్ప్‌నకు ఎన్‌ఏఆర్‌సీఎల్ రూ. 228 కోట్లు ఆఫర్ చేయగా.. రూ. 405 కోట్ల బిడ్‌తో ఖాతాను ఫీనిక్స్ ఏఆర్‌సీ గెలుచుకుంది. కాగా.. బ్యాడ్ బ్యాంక్ మొండి రుణాల కొనుగో లుని 15–85 నిష్పత్తిలో ఆఫర్ చేస్తుంది. అంటే 15 శాతం ముందస్తు చెల్లింపు, మిగిలిన 85% బకాయిల నుంచి రికవరీ ద్వారా చెల్లిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment