పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
పులివెందుల/తొండూరు : తీవ్ర కరువు కోరల్లో చిక్కుకున్న అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. రబీలో సాగు చేసి ఎండిపోయిన బుడ్డశనగ, పొద్దుతిరుగుడు, ధనియాల పంటలను సోమవారం వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డితో కలసి ఆయన పరిశీలించారు. పూర్తిస్థాయిలో రైతులకు పంట నష్టం జరిగిందని ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు.
ముద్దనూరు వ్యవసాయ శాఖ ఏడీ వినయ్‌రెడ్డి, వ్యవసాయాధికారులు కిశోర్ నాయక్, మధుసూదన్‌రెడ్డి, తహశీల్దార్ ఎల్.వి.ప్రసాద్, ఎంపీడీవో ప్రభాకర్‌రెడ్డిలతో పంట నష్టంపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అధికారులతో మాట్లాడుతూ పంటలను చూస్తే చాలా బాధాకరంగా ఉందని.. 10 ఎకరాల్లో సాగు చేస్తే కనీసం తినడానికి కూడా దిగుబడి రాలేదని విచారం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడి ఇన్సూరెన్స్ అందేవిధంగా చూస్తానని రైతులకు అవినాష్‌రెడ్డి భరోసా ఇచ్చారు. దీనిపై లోక్‌సభలో కూడా చర్చిస్తానని హామీ ఇచ్చారు.
ఇలాంటి కరువు చూడలేదు : వందేళ్ల నుండి ఇలాంటి కరువు చూడలేదని రైతులు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి విన్నవించారు. పంటలు ఎండిపోయాయి. బోరుబావుల్లో భూగర్భజలాలు ఎండిపోయి వందల అడుగుల లోతులో వేసిన బోర్లల్లో చుక్కనీరు పడలేదని.. వ్యవసాయానికి కాదు కదా తాగడానికి నీరు కూడా దొరుకుతుందో.. లేదో సార్ అంటూ రైతులు తమ గోడు విన్నవించారు. బోడివారిపల్లెకు చెందిన రైతు మల్లేల వెంకట్రామిరెడ్డి తన గోడు విన్నవించారు.
10 ఎకరాల్లో బుడ్డశనగ పంటను ఎకరానికి రూ.15వేలు ఖర్చు చేసి సాగు చేస్తే కనీసం బస్తా కూడా దిగుబడి లేదని రైతులు వాపోయారు. దీంతో రైతులు అధైర్యపడొద్దని.. ప్రభుత్వంపై వైఎస్‌ఆర్‌సీపీ తరపున పోరాటం చేసి అండగా ఉంటామని వైఎస్ అవినాష్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఖరీఫ్‌లో రైతులు సాగు చేసిన వేరుసెనగ, పత్తి పంటలకు ఇన్‌ఫుట్ సబ్సిడీ కోసం జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ అధికారులు 7వేల హెక్టార్లు అంటూ నివేదిక ఇవ్వడంపట్ల రైతులకు అన్యాయం చేశారని ఎంపీ పేర్కొన్నారు.
రెవెన్యూ అధికారులు కచ్చితమైన విస్తీర్ణం చూపి ఉంటే రైతులకు న్యాయం జరిగి ఉండేదన్నారు. ప్రభుత్వం అనంతపురం జిల్లాకు ఇన్‌ఫుట్ సబ్సిడీ కింద *1300 కోట్లు మంజూరు చేస్తే.. వైఎస్‌ఆర్ జిల్లాకు కేవలం *600కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. జిల్లాపై ప్రభుత్వం ఎంత వివక్షత చూపుతుందో దీన్నిబట్టి అర్థమవుతోందని వైఎస్ అవినాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. 2010-11 సంవత్సరానికి ఉల్లి, బుడ్డశనగకు రావాల్సిన ఇన్సూరెన్స్ పెండింగ్‌లో ఉందని.. వెంటనే పరిష్కరించాలన్నారు.
అలాగే 2011-12కు రబీలో రైతులు పంటల బీమాకు సంబంధించి ఏ పంటకు ఇన్సూరెన్స్ వర్థిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ ఇన్సూరెన్స్ చీఫ్ రీజినల్ అధికారి ఎం.రాజేశ్వరి సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. వెంటనే ఆమె స్పందించి పెండింగ్‌లో ఉన్న రైతులు ఇన్సూరెన్స్ డబ్బులు త్వరలో అందజేస్తామని.. జనవరి చివరికి 2012కు సంబంధించిన ఇన్సూరెన్స్ దరఖాస్తులు పరిశీలించి వివరిస్తామని ఆమె తెలిపారు.
అంతకుముందు వైఎస్ అవినాష్‌రెడ్డి తొండూరుకు రాగానే పాటిమీద ఆంజనేయస్వామి ఆలయం వద్ద వైఎస్‌ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. తొండూరు ఎస్‌ఐ శ్రీనివాసులు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్ సీపీ మండల పరిశీలకుడు బండి రామమునిరెడ్డి, ఎంపీపీ భర్త భూమిరెడ్డి రవీంద్రనాథరెడ్డి, సీనియర్ నాయకులు ఎర్ర గంగిరెడ్డి, తాలుకా ప్రధాన కార్యదర్శి దశరథరామిరెడ్డి, ఎంపీటీసీలు పాలూరు వేణుగోపాల్‌రెడ్డి, అగడూరు శివశంకర్‌రెడ్డి, సర్పంచ్‌లు వెంకట చలమారెడ్డి, ప్రకాష్‌రావు, తుమ్మల గంగిరెడ్డి, మాజీ సర్పంచ్‌లు సురేష్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఈశ్వరరెడ్డి, రత్నమయ్య, గంగులయ్య, మాజీ కో.ఆప్సన్ సఫి, వాటర్ షెడ్ చెర్మైన్ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.