
సాక్షి కడప : టీడీపీ అధినేత చంద్రబాబు రూటే సపరేటుగా మారింది. ఎన్నికలకు ముందు ఏవోవో చెప్పడం....అధికారంలోకి వచ్చాక విస్మరించడం పరిపాటిగా మారింది. 2014కు ముందు ఇంటింటికి ఉద్యోగం.. లేకపోతే చదువుకున్న ప్రతి ఒక్కరికీ భృతి అంటూ ఊదరగొట్టారు. ఐదేళ్ల నాటి వరకు పట్టించుకోకుండా చివరిలో భృతి రూ. 1000లకు పరిమితం చేసి ఆంక్షలతో అందని ద్రాక్షలా వేలాడదీశారు. ఎప్పుడూ లేని తరహాలో టీడీపీ మేనిఫెస్టోలో కూడా ఉద్యోగాలను భర్తీ చేస్తామని.. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి కమిటీలతో కాలయాపన చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉన్న వారిని తొలగించే ప్రక్రియలో నిమగ్నమయ్యారు.
ఒక్కొక్కశాఖ సిబ్బందిని ఒక్కొక్కసారి...
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ వేతనంతో మండలాల్లో పనిచేస్తూ రైతులకు సలహాలు, సూచనలు ఇస్తున్న ఆదర్శ రైతులను జిల్లా వ్యాప్తంగా దాదాపు 2500 మందికి పైగా తొలగించారు. తర్వాత జిల్లాలో 150మందికి పైగా ఉన్న హౌసింగ్ వర్క్ ఇన్‌స్పెక్ట ర్లను తొలగించారు. తర్వాత ఆందోళన చేయడం, అనంతరం అర్హతలు చూసి కొతమందిని చేర్చుకున్నా చాలామంది ఇంటికే పరిమితం అయ్యేలా చేశారు.
తర్వాత ఉపాధి హామీలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను నూరు శాతం పనులు చేయించలేదని సాకు చూపుతూ జిల్లాలో వందలాదిమందికి చుక్కలు చూపారు. అయితే తర్వాత వారు పోరాటం చేయడం, రాజకీయ ఒత్తిళ్లు, ఇతర కారణాలతో మళ్లీ కొందరిని తీసుకోగా, ఇంకొందరిని ఇంటిబాట పట్టేలా చేసి కొత్త వారిని తీసుకున్నారు. ఆరోగ్యమిత్రలను కూడా అదేవిధంగా తొలగించి అర్హతల పేరుతో ప్రభుత్వం పరీక్షకు సిద్ధమైంది.
అయితే వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించంతో పాటు పోరాట ఫలితంగా తిరిగి అవకాశం పొందారు. ఆశా వర్కర్లను కూడా చాలా మందిని ఇంటిదారి పట్టించారు. తర్వాత జిల్లాలో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న పదిమంది వైద్యులను కూడా ఇటీవలే ప్రభుత్వం తొలగించింది. తాజాగా మెప్మాలో పనిచేస్తూ డ్వాక్రా గ్రూపుల బలోపేతానికి కృషి చేస్తున్న ఐబీసీఆర్‌పీలను సాగనంపారు.
కనిపించని ఇంటింటికి ఉద్యోగం
ఎన్నికలకు ముందు ఇంటింటికి ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి అంటూ ఊదరగొట్టినప్పటికి ఈనాటికి ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ఎన్నికలు ముగిసి ఐదేళ్లు పూర్తయి... మళ్లీ షెడ్యూల్ విడుదలయినా ఇప్పటికీ రాష్ట్రంలో భారీగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయలేదు. ఆయా శాఖల్లో భారీగా పోస్టులు ఉన్నా కేవలం మూడు, నాలుగు ఉద్యోగ నోటిఫికేషన్లతోనే టీడీపీ సర్కార్ సరిపెట్టింది. నిరుద్యోగ భృతి అయినా పెద్ద ఎత్తున ఇస్తారనుకుంటే ఒక్కొక్కరికి మేనిఫెస్టోలో రూ. 2 వేలు ఇస్తామని పేర్కొని చివరికి రూ. 1000తో సరిపెడుతూ అదీ ఎన్నికలకు ముందు ఓట్ల ఎత్తుగడే లక్ష్యంగా అమలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment