వేంపల్లె : జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగి 17 నెలలు కావస్తోంది. ఎన్నికల నిర్వహణ కోసం ఆయా మండలాల్లో ఎంపీడీవోలు ఖర్చు చేసిన సొమ్మును ఎన్నికల సంఘం నుంచి విడుదల చేయకపోవడంతో అధికారులు ఆవేదన చెందుతున్నారు. నిధులు విడుదల కాకపోవడంతో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు అభ్యర్థులు డిపాజిట్‌గా చెల్లించిన సొమ్మును ఆయా మండలాలకు చెందిన ఎంపీడీవోలు వెనక్కి ఇవ్వకుండా ఖర్చు చేస్తున్నారు.
గతంలో ఉన్న కలెక్టర్ కోన శశిధర్ దృష్టికి ఎంపీడీవోలంతా ఈ విషయాన్ని తీసుకెళ్లగా ఒక్కో మండలానికి రూ.70వేల నిధులను అందించారు. ఆ తర్వాత ఎన్నికల సంఘం నుంచి మిగిలిన నిధులు వచ్చేందుకు ఎవరూ పట్టించుకోకపోవడంతో అవి అలాగే మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఎంపీడీవోల బదిలీలు జరగడంతో ఈ విషయం అటకెక్కింది. ప్రస్తుతం పోటీచేసిన అభ్యర్థులు తమ డిపాజిట్లు వెనక్కి ఇవ్వాలని ఆయా ఎంపీడీవోల వద్దకు వెళ్లి తీవ్రస్థాయిలో ఒత్తిడి తేవడంతోపాటు వినతి పత్రాలు అందిస్తున్నారు. ఎన్నికల సంఘం నుంచి నిధులు వచ్చిన తర్వాతనే సంబంధిత డిపాజిట్లు చెల్లిస్తామని అధికారులు చెబుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా రూ.2కోట్లు :
గత ఏడాది జులై నెలలో జిల్లాలో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఇందుకు సంబంధించిన సర్పంచ్ అభ్యర్థులు, వార్డుమెంబర్లు ఎన్నికల్లో పోటీ చేసేందుకు డిపాజిట్లు చెల్లించారు. జనరల్ కేటగిరిలో బరిలో దిగిన వారు రూ.2వేలు, బీసీలుగా బరిలో దిగిన వారు రూ. 1000లు.. ఓసీ వార్డు మెంబర్లు రూ.500లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వార్డు మెంబర్లు రూ.250లను డిపాజిట్‌గా చెల్లించారు. ఇందులో ఓట్ల సంఖ్యలో 10శాతానికి తగ్గితే డిపాజిట్లు గల్లంతైన వారి పాజిట్‌ను జనరల్ ఫండ్‌కు కలుపుతారు. మిగతా వారి డబ్బును వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది.
దాదాపు ఒక్కో మండలం నుంచి రూ.1.50లక్షల వరకు డిపాజిట్ సొమ్ము అందించాల్సి ఉంది. ఇదిలా ఉండగా వచ్చిన డిపాజిట్ల మొత్తాన్ని ఎన్నికల సంఘం నుంచి నిధులు రాకపోవడంతో వాడుకున్నారు. ఎన్నికల సంఘం నుంచి నిధులు వచ్చిన తర్వాత డిపాజిట్లు చెల్లిస్తామనుకున్న అధికారులకు డబ్బు రాకపోవడంతో ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. జిల్లాలోని 50మండలాల్లో అధికారులు ఎన్నికల నిర్వహణ కోసం భోజన వసతి, బారికేడ్ల నిర్మాణం, వాహన సదుపాయం, డీజిల్ ఖర్చులు తదితర వాటికోసం ఒక్కో మండలానికి రూ.1.50లక్షలనుంచి రూ.4లక్షల వరకు ఖర్చు చేశారు.
డిపాజిట్ల మొత్తం కొంత వాడుకోగా.. మిగిలిన మొత్తాన్ని అప్పులు చేసి చెల్లించారు. దాదాపు జిల్లా వ్యాప్తంగా రూ.2కోట్ల నిధులు ఎన్నికల సంఘం నుంచి రావాల్సి ఉంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని ఎన్నికల సంఘం నుంచి నిధులు వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని అధికారులు, నామినేషన్ వేసిన అభ్యర్థులు కోరుతున్నారు.
డిపాజిట్ సొమ్ము వెనక్కు ఇచ్చేదెప్పుడో..!
Published Sun, Dec 28 2014 3:53 AM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM
Advertisement
Advertisement