మూడు గంటల హెలికాప్టర్ గాలింపులో కనపడని వైనం
కేంద్రం నుంచి సాయం శూన్యం
వెతుకలాటలో స్నేహితులు
సంగం : మండలంలోని గాంధీజనసంగంకు చెందిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు జాడపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చిలీ సమీపంలోని ఆండీస్ పర్వాతాల్లో హెలికాప్టర్ గాలింపులో మస్తాన్‌బాబు జాడ కనపడలేదు. భారతదేశ సాయం శూన్యంగా మారిందని, తామే వెతుకులాడుతున్నామని స్నేహితులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే.. మస్తాన్‌బాబు వెతుకులాటకు సంబంధించి మంగళవారం మధ్యాహ్నం మూడు నుంచి ఆరుగంటల వరకు హెలికాప్టర్ ఏరియల్ సర్వే సాగింది.
ఈ సర్వేలో మస్తాన్‌బాబు జాడ కనపడలేదని సర్వే సిబ్బంది వెల్లడించారు. ఈ సర్వే సమయంలో ఇంగ్లాండ్ మౌంటనీర్ ఒకరు తారసపడగా ఆయన్ను తీసుకొచ్చినట్లు సిబ్బంది చె బుతున్నారని మస్తాన్‌బాబు అన్న పెద్ద మస్తాన్‌బాబు తెలిపారు. ఏరియల్ సర్వే కేవలం 5వేల మీటర్ల ఎత్తువరకు సాగిందని, అంతకన్నా పైకి వెళ్లే సామర్థ్యం ఏరియల్ సర్వే చేస్తున్న హెలికాప్టర్‌కు లేదని మస్తాన్‌బాబు స్నేహితులు తెలిపారన్నారు. మూడు గంటల వరకు గాలింపు జరిపి ప్రస్తుతం ఆపి ఉన్నారన్నారు.
భారతదేశ సాయం శూన్యం
మస్తాన్‌బాబు వెతుకులాటకు అవసరమైన సాయం చేస్తామన్న కేంద్రమంత్రులు మాటలకే పరిమితమయ్యారు. ఇంతవర కు దానికి సంబంధించిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని మస్తాన్‌బాబు స్నేహితులు తమతో అన్నట్లు పెదమస్తాన్‌బాబు పేర్కొన్నారు. స్నేహితులైన మౌంటనీర్లు తామే స్వయంగా వెతుకులాట ప్రారంభించారని తెలిపారు. వాళ్లు వెతికి తీసుకుని వస్తే తప్ప మరో గత్యంతరం లేదని అన్నారు.
పర్వతారోహకుడు మస్తాన్‌బాబు జాడేదీ?
Published Fri, Apr 3 2015 3:07 AM | Last Updated on Sat, Sep 2 2017 11:45 PM
Advertisement