పింఛను కార్డులపై నా ఫొటో ఏదీ?
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల పింఛనుదారులకు అందజేస్తున్న గుర్తింపు కార్డుల మీద రాష్ర్ట ప్రభుత్వ రాజముద్ర, తన ఫొటో లేకపోవడంపై సీఎం చంద్రబాబునాయుడు అధికారుల మీద అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రాజముద్ర, తన ఫొటో ఉండేలా వెంటనే మార్పు చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు ఆ కార్డులు తీసుకువచ్చి ఈ విషయమై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు వెంటనే ఈ తప్పు సరిదిద్దాలని ఆదేశించారు. శనివారం ఉదయం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ అంశం చర్చకు రావడంతో ఇది వెలుగుచూసింది. ప్రభుత్వం ఎన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించినా వాటిని సమర్థవంతంగా అమలు చేయలేకపోతే ప్రభుత్వానికి ఉపయోగం ఉండదని సమీక్షలో పేర్కొన్న సీఎం.. పింఛను కార్డులను ఉదహరించారని తెలిసింది.