కనిగిరి, న్యూస్‌లైన్ : జిల్లాలో పశువైద్యం అధ్వానంగా తయారైంది. పశువులు, గొర్రెలు, మేకలు పలురకాల వ్యాధులబారినపడి సకాలంలో వైద్యమందక చనిపోతున్నప్పటికీ పశువైద్యశాఖాధికారులు, సిబ్బంది నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా జిల్లావ్యాప్తంగా మూగజీవాలను వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ప్రధానంగా కనిగిరి నియోజకవర్గంలో పరిస్థితి ఘోరంగా ఉంది. ఈ నియోజకవర్గంలో వ్యవసాయం తర్వాత ఎక్కువమంది పశుపోషణపైనే ఆధారపడి జీవిస్తున్నారు. కానీ, పశువైద్యం నామమాత్రంగా కూడా అందకపోతుండటంతో వాటి పోషకులు తీవ్రంగా నష్టపోతున్నారు.
నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో సుమారు 1.5 లక్షలకుపైగా గేదెలు, 5 లక్షలకుపైగా గొర్రెలు, లక్షకుపైగా మేకలు ఉన్నాయి. వాటికి వైద్యసేవలందించేందుకు ఇటీవల స్థాయిపెంచిన గురవాజీపేట, శీతారాంపురం, రేగిచెట్లపల్లి, మొగుళ్లూరు, పెదఅలవలపాడుతో కలిపి 13 వరకూ పశువైద్యశాలలున్నాయి. వాటిలో కనిగిరి పట్టణంలోని పశువులాస్పత్రి (ఏడీఏహెచ్ పోస్టుతో) కూడా ఉంది.
వేధిస్తున్న పశువైద్యుల కొరత...
కనిగిరి నియోజకవర్గంలోని పశువైద్యశాలల్లో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. హనుమంతునిపాడు, పీసీ పల్లి పశువైద్యశాలల్లో వైద్యాధికారుల పోస్టులు ఏడాది నుంచి ఖాళీగా ఉన్నాయి. వేములపాడు, ముప్పళ్లపాడు, డీజీ పేట, నల్లమడుగుల, రేగిచెట్లపల్లి, బల్లిపల్లి ఉపకేంద్రాల్లో సీనియర్ కాంపౌండర్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. పామూరు మండలం రేగిచెట్లపల్లి పశువైద్యశాలలో వైద్యాధికారి, కాంపౌండర్, సిబ్బంది పోస్టులన్నీ ఖాళీగా ఉండటంతో ఆ ప్రాంతంలో పశువైద్యసేవలు శూన్యంగా ఉన్నాయి. పురాతనకాలంనాటి భవనాల్లో పశువైద్యశాలలు నిర్వహిస్తుండటంతో కనీస వసతులు లేకుండా పోయాయి. వాటిలో విధులు నిర్వహించేందుకు సిబ్బంది ఎవరూ ఉండటం లేదు. సిబ్బంది ఉన్న వైద్యశాలల్లో కూడా మొక్కుబడిగా అలావచ్చి ఇలా వెళ్తున్నారు. గ్రామాల్లో పర్యటించి పశువ్యాధుల నివారణకు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. రెండు నెలలుగా నియోజకవర్గంలో పలురకాల వ్యాధుల బారినపడి వందల సంఖ్యలో గొర్రెలు, మేకలు మృతిచెందాయి. దీనిపై పత్రికల్లో కథనాలు వస్తున్నప్పటికీ స్పందించేవారు కరువయ్యారు.
ఆగిన సంచార పశువైద్యశాల...
పశువులకు మెరుగైన వైద్యసేవలందించేందుకు ప్రారంభించిన సంచార వైద్యశాల కనిగిరి నియోజకవర్గంలో మూడు నెలలుగా నిలిచిపోయింది. సంచార వైద్యశాలకు ఒక పశువైద్యాధికారి, ఒక కాంపౌండర్ ఉండాలి. కానీ, వారిని నియమించలేదు. వైద్యశాల నిర్వహణకు నిధులు విడుదల చేస్తుండటంతో నియోజకవర్గంలోని ఆరు మండలాల పశువైద్యాధికారులు రోజుకొకరు చొప్పున వారంలో ఆరు రోజులపాటు సంచార వైద్యశాలలో విధులు నిర్వర్తించి పశువైద్యసేవలందించేవారు. కానీ, మూడు నెలలుగా నిధులు కూడా నిలిచిపోవడంతో సంచార పశువైద్యశాల ఆగిపోయింది. ఫలితంగా పశువులను వ్యాధులు చుట్టుముట్టి చంపేస్తున్నాయి. వాటి పోషకులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా పశువైద్యశాఖ ఉన్నతాధికారులు స్పందించి మెరుగైన పశువైద్యసేవలందించి వ్యాధులు నివారించాలని, మూగజీవాలను కాపాడాలని పోషకులు కోరుతున్నారు.
పశువైద్యం ఎక్కడ..?
Published Sun, Dec 15 2013 4:35 AM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM
Advertisement
Advertisement