
మార్చురీ ముడుపులపై విచారణకు ఆదేశం
విశాఖ మెడికల్: శవ పరీక్షల (పోస్టుమార్టం) కోసం ప్రభుత్వ వైద్యులు ముడుపులు తీసుకుంటున్నారని వచ్చిన ఆరోపణపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు విచారణకు ఆదేశించారు. కేజీహెచ్‌లో నెలలోపు పిల్లల సంరక్షణ కోసం రూ.38 లక్షల వ్యయంతో ఎన్‌ఐసీయూ మొదటి అంతస్తులో నూతనంగా నిర్మించిన నవజాత శిశువుల ప్రత్యేక వైద్య విభాగం (ఎన్‌ఎస్‌ఐసీయూ)ను మంత్రి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసూతి వార్డును ఎంపీ హరిబాబు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌తో కలసి సందర్శించారు. ఆస్పత్రిలో అందుతున్న సేవల గురించి ప్రసూతి మహిళలతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జననీ సురక్ష పథకం కింద చికిత్స పొందుతున్న తల్లులకు మంత్రి భోజన పథకాన్ని ప్రారంభించారు. ‘మనుషులేనా వీళ్లు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాన్ని మీడియా ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లి.. కేజీహెచ్ ఫోరెన్సిక్ విభాగం వైద్యులు పోస్టుమార్టం కోసం రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు ముడుపులు తీసుకుంటున్నారని చెప్పడంతో ఆయన తీవ్రంగా స్పందించారు.
ముడుపులు తీసుకొనే వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ అవినీతి వ్యవహారంపై 24 గంటల్లోగా సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్, వైద్య కళాశాల ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. రాష్ట్రంలో త్వరలో వెయ్యి నర్సు పోస్టుల భర్తీ చేస్తామని, అందులో విశాఖ కింగ్‌జార్జి ఆస్పత్రికి కూడా కొందరిని కేటాయిస్తామన్నారు. కేజీహెచ్‌లో నర్సు పోస్టులు తీవ్ర కొరత ఉండడం వాస్తవమేనని, ఆర్థిక శాఖ ఆమోదం లభించిన వెంటనే ఈ కొరతను త్వరలో తీరుస్తామన్నారు. కేజీహెచ్‌లో రూ.85 కోట్లతో నిర్మించనున్న సర్జికల్ అంకాలజీ స్పెషాల్టీ బ్లాక్ (సీఎస్‌ఆర్) నిర్మాణానికి సంబంధించి టెండర్లను గురువారం తెరిచినట్లు తెలిపారు. విమ్స్ ఆస్పత్రిని త్వరలో ప్రారంభిస్తామన్నారు. వైద్య పరికరాల కొనుగోలుకు సంబంధించి టెండర్లు పిలిచామని, సిబ్బంది నియామకానికి సంబంధించి రెండు రోజుల క్రితమే వివిధ వైద్య విభాగాల నుంచి డెప్యుటేషన్లపై వచ్చేందుకు జీవోను విడుదల చేశామన్నారు. వైద్యులు లేని ఏజెన్సీ ప్రాంతంలో హెల్త్ ఏటీఎం పేరుతో గిరిజనులకు మందుల పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్‌మధుసూదనబాబు, ఏఎంసీ ప్రిన్సిపాల్ ఎస్.వి.కుమార్, విమ్స్ ఓఎస్‌డీ డాక్టర్ పి.వి.సుధాకర్, డెప్యూటీ సూపరింటెండెంట్లు ఉదయ్‌కుమార్, వైస్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరెడ్డి, ప్రసూతి,పిల్లల వార్డుల విభాగాధిపతులు శారదాబాయ్, పద్మలత ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ తదితరులు పాల్గొన్నారు.