రోజంతా బిజీ బిజీ | Whirlwind tour of chandra babu naidu | Sakshi
Sakshi News home page

రోజంతా బిజీ బిజీ

Published Tue, Nov 18 2014 2:25 AM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM

రోజంతా బిజీ బిజీ - Sakshi

రోజంతా బిజీ బిజీ

విశాఖ రూరల్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. రోజంతా బిజీ బిజీగా గడిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు వనమహోత్సవం, అభినందన సభల్లో పాల్గొన్నారు. షెడ్యూల్ ప్రకారం సీఎం ఉదయం 10.30 గంటలకు రావాల్సి ఉండగా 50 నిమిషాలు ఆలస్యంగా 11.20కి ప్రత్యేక విమానంలో విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి నేరుగా ఎంవీపీ కాలనీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, అనంతరం ప్రజలతో హరిత ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలని పిలుపునిచ్చారు.

మొక్కలు నాటడం, నాటిన వారి పేరు, ఆ ప్రాంతం, వాటి ఎదుగుదల వంటి విషయాలను జీయోటాగింగ్ ద్వారా అప్‌లోడ్ చేసి ఆన్‌లైన్‌లో తెలుసుకునేందుకు వీలుగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను సీఎం ప్రారంభించారు. అక్కడ నుంచి కైలాసగిరిపై నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమానికి బయలుదేరి మధ్యలో తెన్నేటి పార్కు వద్ద గీతం విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు.

గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్ట్ విద్యార్థులు తెన్నేటి పార్కును ఏ విధంగా అందంగా తీర్చిదిద్దవచ్చో సీఎంకు ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ముఖ్యమంత్రి వారి ప్రయత్నానికి అభినందిస్తూ మొక్కలు నాటడంతోపాటు వాటిని పరిరక్షించే బాధ్యతను కూడా తీసుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. సీఎం పార్కులో మొక్కలు నాటారు. తెన్నేటి పార్కు నుంచి సీఎం కైలాసగిరికి చేరుకున్నారు. కొండపై అవతార్ మెహర్‌బాబా కేంద్రాన్ని సందర్శించారు. తరువాత వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, మహిళలతో ముచ్చటిస్తూ భోజనం చేశారు. డ్వాక్రా మహిళలను ఉద్దేశించి కొద్దిసేపు ప్రసంగించి బీచ్ రోడ్డు నుంచి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. 30 నిమిషాలు ప్రత్యేక బస్సులో విశ్రాంతి తీసుకొని సాయంత్రం 5 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. తర్వాత విలేకర్ల సమావేశంలో మాట్లాడిన అనంతరం గురజాడ కళాక్షేత్రంలో విశాఖ క్రైస్తవ సంఘాలు ఏర్పాటు చేసిన కృతజ్ఞతాపూర్వక సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ నుంచి ఆర్‌కే బీచ్ వద్ద పర్యాటక శాఖ నిర్వహించిన విశాఖ పునరుద్ధరణ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం వుడా పార్కులో జరిగిన కార్యక్రమంలో తుపాను పునరుద్ధరణ పనుల్లో విశేష సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగులను సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement