బాధ్యతతోనే రాజకీయాల్లోకి: పవన్ కల్యాణ్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తనకు రాజకీయాలంటే ఆసక్తి లేదని, బాధ్యత కారణంగానే అందులోకి వెళ్లాల్సివచ్చిందని సినీనటుడు పవన్ కల్యాణ్ అన్నారు. జీఎంఆర్ గ్రూప్ ఆధ్వర్యంలోని వరలక్ష్మి ఫౌండేషన్, నైరేడ్, ఆస్పత్రి తదితర సంస్థల పనితీరును చూసేందుకు సంస్థ అధినేత గ్రంథి మల్లికార్జునరావుతో కలిసి మంగళవారం ఆయన రాజాం వచ్చారు. ఈ సందర్భంగా జీఎంఆర్ ఐటీలో విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ సినిమాల్లో మాట్లాడింది వేరు, నిజ జీవితంలో జరుగుతున్నది వేరని చెప్పారు.
జీవితంలో అన్నీ చూశానని, సమాజం అంటే విసుగొస్తోందని, ఓ దశలో ఈ దేశం వదిలి వెళ్లిపోవాలనుకున్నానని వెల్లడించారు. హృదయం ఒప్పుకోలేదని, మనసు మార్చుకుని, ఎన్ని కష్టాలెదురైనా పోరాడుతున్నానన్నారు. ఈ పోరాటానికి తన ఒక్కడి శక్తి సరిపోదని, పదిమంది కలిస్తే ఏదైనా సాధించవచ్చన్నారు. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన స్వచ్ఛభారత్ తనకు ఎంతో నచ్చిందని చెప్పారు. ఆ నినాదం మోదీ ఇచ్చారని కాకుండా, నిత్య జీవితంలో అందరూ పాటించాల్సిందేనన్నారు. కార్యక్రమానికి పెద్దసంఖ్యలో విద్యార్థులు, ప్రజలు హాజరయ్యారు.