కమిటీలతో కాలయాపన చేస్తారా? | why wasting time with committees | Sakshi
Sakshi News home page

కమిటీలతో కాలయాపన చేస్తారా?

Published Wed, Jul 16 2014 3:19 AM | Last Updated on Sat, Sep 2 2017 10:20 AM

కమిటీలతో కాలయాపన చేస్తారా?

కమిటీలతో కాలయాపన చేస్తారా?

సాక్షి ప్రతినిధి, తిరుపతి : రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని తక్షణమే సరిచేయాలని రైల్వే మంత్రి సదానందగౌడను రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి డి మాండ్ చేశారు. మంగళవారం రైల్వే బడ్జెట్‌పై లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ మొదట తనను గెలిపించి సభలోకి పంపిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, రాజంపేట పార్లమెంట్ స్థానం ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు.

రైల్వే బడ్జెట్‌లో ఎన్నడూ లేని రీతిలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారన్నారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 29 ప్రాజెక్టులను పూర్తిచేయడానికి సరిపడా నిధులు కేటాయించకుండా.. సమన్వయ కమిటీని ఏర్పాటుచేయడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు. సమన్వయ కమిటీని నియమించడమంటే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయకుండా నాన్చడమేనన్నారు.
 
తగినన్ని నిధులు కేటాయించి రైలుమార్గాలను పూర్తిచేయిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వివరించారు. బెంగళూరు-కడప రైలుమార్గానికి కేవలం రూ.30 కోట్లే కేటాయించడం దారుణమన్నారు. 2015 నాటికే పూర్తికావాల్సిన ఆ రైలుమార్గం, నిధులు ఇలానే కేటాయిస్తూ పోతే రెండు దశాబ్దాలకు కూడా పూర్తి కాదన్నారు. కడప-బెంగళూరు రైలుమార్గానికి భారీ ఎత్తున నిధులు కేటాయించి.. యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి నుంచి మదనపల్లె, గుత్తి మీదుగా హైదరాబాద్‌కు రోజూ నడిచేలా ఎక్స్‌ప్రెస్ రైలు మంజూరు చేయాలన్నారు.
 
వైఎస్‌ఆర్ జిల్లా నందలూరు లోకోషెడ్‌ను తక్షణమే ప్రారంభించాలని కోరారు. తిరుపతి రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాల మేరకు తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా.. మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటుచేయలేదని విమర్శించారు. రోజూ వేలాదిగా భక్తులు వచ్చి వెళ్లే తిరుపతి రైల్వేస్టేషన్‌లో అంతర్జాతీయ ప్రమాణాల మేరకు సౌకర్యాలను తక్షణమే కల్పించాలని డిమాండ్ చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement