పరిటాలలో భర్త ఇంటి ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న స్రవంతి
పరిటాల (నందిగామ టౌన్) : కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో ఓ వివాహిత మౌన పోరాటానికి దిగింది. భర్త ఇంటి ముందు భార్య ఆందోళన చేపట్టింది. సేకరించిన వివరాల ప్రకారం మండలంలోని పరిటాల గ్రామానికి చెందిన కర్ల రాంబాబు, నందిగామ మండలం అంబారుపేటకు చెందిన స్రవంతిలకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వివాహమైనప్పటి నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు పొడసూపాయి. దీంతో గతంలో స్రవంతి పోలీసులను కూడా ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు, గ్రామ పెద్దలు పలుమార్లు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినప్పటికీ వారి కాపురం కుదుటపడలేదు దీంతో ఇరువురు విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో తనను కాపురానికి తీసుకెళ్లాలని కోరుతూ స్రవంతి భర్త రాంబాబు ఇంటి ఎదుట గురువారం ఆందోళనకు దిగింది. స్రవంతి నిరసన చేపడుతుండగానే భర్త రాంబాబు, అతని తల్లి ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిపోయారు. దీంతో ఆ దగ్గరల్లోనే అతను పనిచేసే టెంట్ హౌస్ ఎదుట బంధువులతో కలిసి ఆమె నిరసనకు దిగింది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ మణికుమార్.. స్రవంతికి రక్షణగా ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను పంపించారు. కాగా, వివాహమైనప్పటి నుంచి అదనపు కట్నం కోసం భర్త వేధిస్తున్నాడని స్రవంతి ఆరోపిస్తోంది. అయితే, రాంబాబు మాత్రం మూడున్నరేళ్లుగా ఇద్దరి మధ్య సఖ్యత లేదని, ఇప్పటి వరకు గుర్తుకురాని భర్త ప్రస్తుతం ఎందుకు గుర్తుకు వచ్చాడో తెలియటం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ పరుపు ప్రతిష్టలను మంటగలిపేందుకే నిరసన చేస్తోందని వాపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment