
ప్రత్యేక హోదా సాధిద్దాం
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వచ్చే వరకూ పోరాడి సాధిద్దామని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పిలుపునిచ్చారు.
♦ పార్లమెంటు లోపల, బయటా పోరాడతాం
♦ ఏపీసీసీ నేతలతో సోనియా
♦ కాంగ్రెస్ కష్టం వృథా కాదన్న రాహుల్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వచ్చే వరకూ పోరాడి సాధిద్దామని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పిలుపునిచ్చారు. పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి నేతృత్వం లో 300 మందితో కూడిన ప్రతినిధి బృందం ప్రత్యేక హోదా సాధన లక్ష్యంగా కోటి సంతకాల సేకరణను, 13 జిల్లాల్లో మట్టి, నీళ్లను సేకరించి ఢిల్లీకి తెచ్చిన సంగతి తెలిసిందే. బుధవారం వీటిని ఇక్కడి ఏఐసీసీ కార్యాలయంలో ప్రదర్శించారు. కోటి సంతకాల జాబితాలో సోనియా, మన్మోహన్‌సింగ్, రాహుల్‌గాంధీ సంతకాలు చేశారు. సోనియా మాట్లాడుతూ.. ‘ముందుగా లెమాటి వెంకయ్య (గుండెపోటుతో మృతి చెందిన చలోఢిల్లీ బృందంలోని సభ్యుడు) కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియపరుస్తున్నా.
ప్రత్యేక హోదా సాధనకు మీరు కోటి సంతకాల సేకరణ, మట్టి, నీళ్లు సేకరించి తీసుకొచ్చి పోరాడుతున్న తీరుకు అభినందనలు. ఆంధ్ర ప్రదేశ్ విభజన సందర్భంగా ప్రత్యేక హోదా, ప్యాకేజీ, పన్ను రాయితీలు, పోలవరం ప్రాజెక్టు తదితర అనేక అంశాల్లో యూపీఏ ప్రభుత్వం రాష్ట్రానికి అండగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం వీటన్నింటినీ అమలు చేయాల్సిందిపోయి అనిశ్చితిలో పడేసింది. అటు టీడీపీ, ఇటు బీజేపీ ప్రభుత్వం తాత్సారం చేస్తూ వస్తున్నాయి. ప్రధాని అమరావతికి వచ్చినప్పుడు ప్రకటన చేస్తారనుకుంటే ఏపీకి నీళ్లు, మట్టి ఇవ్వడం బాధాకరం. మేమంతా మీవెంట ఉంటాం. పార్లమెంటులోనూ, వెలుపలా పోరాడుదాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిద్దాం..’ అని పేర్కొన్నారు.
హామీలు నెరవేరేంతవరకు పోరాడుదాం..
ఏపీ ప్రజలకు విభజన చట్టం హామీలతోపాటు నాడు రాజ్యసభలో తానిచ్చిన ప్రత్యేక హోదా హామీని ఎన్డీయే ప్రభుత్వం అమలు చేయాలని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ కోరారు. ఆనాడు అన్ని పార్టీలు మద్దతిచ్చాయన్నారు. హోదా వచ్చే వరకూ పోరాడుదామని, విభజన హామీలు నెరవేరే దాకా ఉద్యమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఏపీ ప్రజలకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు.
ఏపీభవన్ వద్ద ధర్నా..
ఏఐసీసీలో అగ్రనేతలతో సమావేశం అనంతరం రఘువీరారెడ్డి, ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, సుబ్బిరామిరెడ్డి, జేడీ శీలం, చిరంజీవి, కేంద్ర మాజీ మంత్రులు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, పళ్లంరాజు, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి, మాజీ ఎంపీలు కనుమూరి బాపిరాజు, చింతామోహన్, రాష్ట్ర మాజీ మంత్రులు వట్టి వసంత్‌కుమార్, శైలజానాథ్, కాసు కృష్ణారెడ్డి, కొండ్రు మురళీ, మండలిలో కాంగ్రెస్ పక్షనేత సి.రామచంద్రయ్య, మహిళా నేత సుంకర పద్మశ్రీ తదితరులతో కూడిన 300 మంది నేతల బృందం ఏపీ భవన్ వద్ద ధర్నా నిర్వహించింది. ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్ ఇవ్వాలంటూ నిరసన తెలిపారు. అనంతరం నేతలను పోలీసులు అరెస్టు చేసి పార్లమెంటు వీధిలోని స్టేషన్‌కు తీసుకెళ్లి సాయంత్రం వదిలిపెట్టారు. నేతల బృందం సాయంత్రం ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీని కలిసింది. ప్రత్యేక హోదా అమలు చేసేలా కేంద్రానికి సూచించాలని విన్నవించింది.
కాంగ్రెస్ కృషి వృథా కాదు : రాహుల్
కాంగ్రెస్ చేస్తున్న కృషి వృథా కాదని రాహుల్ గాంధీ అన్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్ల క్రితం పెద్దమార్పు చోటు చేసుకుంది. నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్, సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ ఏపీకి అండగా ఉంటామన్నాం. కానీ దురదృష్టవశాత్తూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు సాయపడడం లేదు. స్పెషల్ స్టేటస్ కోసం జరుగుతున్న పోరాటంలో పాల్గొనేందుకు నేను కూడా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చాను. కాంగ్రెస్ చేస్తున్న కృషి వృథా కాదు’ అని పేర్కొన్నారు.