
ఒక డీఏ మాత్రమే ఇస్తాం
అయితే ఎప్పుడనేది చెప్పలేం
ఏపీ ఆర్థిక మంత్రి యనమల
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఉద్యోగులకు 2015 సంవత్సరంలో కరువు భత్యం (డీఏ) మంజూరు చేయలేదని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. అయితే ఒక కరువు భత్యం ఇవ్వాలని నిర్ణయించామని, అయితే అది ఎప్పుడు అనేది చెప్పలేమని ఆయన అన్నారు. అదేవిధంగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచుతామని, అయితే ఎప్పుడనేది చెప్పలేమన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణపై సుప్రీంకోర్టు తీర్పును దృష్టిలో ఉంచుకుని వ్యవహరిస్తామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపులు, ఆదాయ లక్ష్యాల సాధన, నాల్గో త్రైమాసికంలో వ్యయ నియంత్రణ, వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూపకల్పనపై యనమల శనివారం ఆర్థికశాఖ ఉన్నతాధికారులు, ఆర్థిక నిర్వహణ కమిటీ సభ్యులతో సుదీర్ఘంగా చర్చించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును కూడా 60 ఏళ్లకు పెంచాలని హైకోర్టు సూచించిన విషయం తమకు తెలియదని ఆయన చెప్పారు.