సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బిల్లు తుదిరూపు దిద్దుకుంటున్న తరుణంలో హైదరాబాద్, భద్రాచలం తదితర అంశాలపై కేంద్రమంత్రుల బృందంపై సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఒత్తిళ్లు పెంచుతున్నందున తామూ ఢిల్లీలోనే ఉండి ఆ ప్రయత్నాలను అడ్డుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. టీ కాంగ్రెస్ నేతలు ఆదివారం లే క్‌వ్యూ అతిథి గృహంలో భేటీ అయ్యారు.ఈ నెలాఖరులోగా జీవోఎం తెలంగాణ బిల్లును కేబినెట్‌కు సమర్పించే అవకాశమున్నందున అంతకుముందే అంతా ఢిల్లీ చేరుకోవాలని నిర్ణయించారు.
కేంద్రమంత్రులు సర్వే సత్యనారాయణ, బలరాంనాయక్, జాతీయ విపత్తుల నివారణ కమిటీ ఛైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య ఎంపీలు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, నంది ఎల్లయ్య, కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. తెలంగాణలోని 117 అసెంబ్లీ స్థానాల సంఖ్యను 153కు పెంచాలని కేంద్రమంత్రుల బృందాన్ని కోరాలని నిర్ణయించారు.ప్రతి లోక్‌సభ నియోజకవర్గానికి 9 అసెంబ్లీ సెగ్మెంట్లు చేయాలని వారు కోరుతున్నారు. దీనిపై జీఓఎంను కలిసేందుకు సోమవారమే ఢిల్లీ వెళ్లనున్నామని మర్రి శశిధర్‌రెడ్డి తెలిపారు. జిల్లా యూనిట్‌గా ఎమ్మెల్యే నియోజకవర్గాలను కేటాయించాలని, అదే మాదిరిగా ఎస్సీ ఎస్టీలకు స్థానాలు కేటాయించాలని బలరాంనాయక్ పేర్కొన్నారు.
క్యాంపు కేపిటల్ గానే అనుమతిద్దాం
విభజన తర్వాత హైదరాబాద్‌ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంచడం సరికాదని పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి తదితర నేతలు అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ ం ప్రకారం అందుకు అవకాశాల్లేవని, ఉమ్మడి అనడం వల్ల సాంకేతికంగా అనేక సమస్యలు కూడా తలెత్తుతాయని వివరించారు. ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్‌సిబాల్ ఉమ్మడి రాజధాని సాధ్యాసాధ్యాలపై కాంగ్రెస్ కోర్‌కమిటీకి నివేదిక ఇచ్చారని తెలిపారు. ఈ నివేదికలో ఉమ్మడి అని కాకుండా కేవలం క్యాంపు కేపిటల్‌గా మాత్రమే చేయాలని సూచించి నట్లు తెలుస్తోందని చెప్పారు. విభజన అనివార్యమని ప్రతి ఒక్కరికీ తెలిసినా సీఎం మాత్రం ఇంకా ప్రజలను మోసగించే తీరులోనే మాట్లాడుతున్నారని వారు దుయ్యబట్టారు. అసెంబ్లీని ప్రొరోగ్ చేయించడం ద్వారా వారం పదిరోజులు అసెంబ్లీ బిల్లును ఆలస్యం చేయించాలని సీఎం ఎత్తుగడ వేస్తున్నారని, దీన్ని తెలంగాణ మంత్రులెవరూ అంగీకరించరాదని సమావేశంలో నేతలు స్పష్టంచేశారు.
బిల్లు పూర్తయ్యేదాకా ఢిల్లీలోనే: తెలంగాణ కాంగ్రెస్ నేతలు
Published Mon, Nov 25 2013 3:11 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
Advertisement
Advertisement