తెలంగాణకు అనుకూలంగా విజయవాడలో సభ పెడితే అనుమతిని ఇస్తారా? అని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం ప్రశ్నించారు. తెలంగాణకు అనుకూలంగా ఉన్న రాజకీయపార్టీలు, సామాజిక జేఏసీ వంటి సంఘాలు, ప్రత్యేక ఆంధ్రా సంఘాలు సభలు పెట్టుకుంటామంటే సీమాంధ్రలో ఎందుకు అనుమతించలేదని ప్రశ్నించారు. తెలంగాణలో భావ ప్రకటనా స్వేచ్ఛకు అనుమతించినప్పుడు అదే సూత్రం సీమాంధ్రలో ఎందుకు అమలుచేయరని అడిగారు.
ఏపీఎన్జీవో సభ, తెలంగాణ బంద్ నేపథ్యంలో శనివారం తెలంగాణ జేఏసీ ముఖ్యనేతలంతా టీఎన్‌జీవో భవన్‌లోనే ఉండి పరిస్థితులను సమీక్షిస్తూ, సమన్వయం చేశారు. కోదండరాంతో పాటు జేఏసీ కో చైర్మన్లు దేవీ ప్రసాద్, వి.శ్రీనివాస్‌గౌడ్, అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్, సి.విఠల్, టీఎన్‌జీవో ప్రధాన కార్యదర్శి కారెం రవీందర్‌రెడ్డి తదితరులు అక్కడ ఉన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ రాజ్యాంగ హక్కులను, ప్రజాస్వామ్యయుతంగా నిరసనలను తెలియజేసే హక్కును తప్పు బట్టలేమన్నారు.
తెలంగాణ ఉద్యమకారులపై నిర్బంధం విధించి, తెలంగాణ ఉద్యమాలను పోలీసులతో అణిచేస్తున్న ముఖ్యమంత్రి, డీజీపీల తీరుపైనే తాము నిరసన వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వం చూపిస్తున్న వివక్షను వ్యతిరేకిస్తూనే బంద్‌ను పాటించామన్నారు. సీమాంధ్రకు చెందిన ఉద్యోగులతో, సామాన్య ప్రజలతో ఎలాంటి శత్రుత్వం లేదన్నారు. బంద్‌ను శాంతియుతంగా నిర్వహించిన అన్నివర్గాలకు కోదండరాం అభినందనలు తెలియజేశారు. శ్రీనివాస్‌గౌడ్, దేవీప్రసాద్, అద్దంకి దయాకర్ మాట్లాడుతూ విజయవాడలో తెలంగాణ సభను పెడతామని, అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో సభపెట్టి తెలంగాణవాదులపైనే దాడికి దిగడం అప్రజాస్వామికమన్నారు. పోలీసులు, ప్రభుత్వం కూడా తెలంగాణకు ఒక చట్టం, సీమాంధ్రకు మరో చట్టాన్ని అమలు చేస్తున్నాయని విమర్శించారు.