సమైక్యవాదమంటే ప్రేమోన్మాదమే: కోదండరాం
హైదరాబాద్, న్యూస్‌లైన్ : సమైక్యవాదాన్ని వినిపించే వారంతా యాసిడ్ దాడి చేసే ప్రేమోన్మాదులతో సమానమని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సమైక్యవాదం అన్న పదం సామ్రాజ్యవాదుల పదమన్నారు. గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సద్భావన సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణ విషయంలో ఎవరు అడ్డు వచ్చినా వదిలి పెట్టేది లేదని.. ఈ విషయంలో తాము తెగించి ఉన్నామన్నారు. సీమాంధ్రకు ఏదైనా అన్యాయం జరిగితే కాంగ్రెస్, టీడీపీలు పరిష్కరించాలన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునకు సీపీఐ, బీజేపీలు కట్టుబడి ఉన్నాయన్నారు. సీమాంధ్రులతో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. తెలంగాణ పీఆర్టీయూ ఆధ్వర్యంలో గురువారం ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన శాంతి దీక్షలోనూ కోదండరాం మాట్లాడారు. ఈ దీక్షలో ఎమ్మెల్సీ పి.సుధాకర్‌రెడ్డి, తెలంగాణ పీఆర్టీయూ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు పి.హర్షవర్ధన్‌రెడ్డి, పి.వే ణుగోపాల స్వామిలు కూర్చున్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ సాధనకు శాంతియుతంగానే పోరాడదామని పిలుపునిచ్చారు. వచ్చే నెల 7న ముల్కీ అమరుల సంస్మరణ దినంగా పాటిస్తూ హైదరాబాద్‌లోని సిటీ కాలేజీ నుంచి భారీ శాంతి ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు. చారిత్రక సందర్భమైన ఆ రోజును పురస్కరించుకొని చేపట్టే ర్యాలీకి అనుమతి ఇప్పించే బాధ్యత తెలంగాణ మంత్రులదేనని స్పష్టం చేశారు.
అనుమతి కోసం మంత్రులతో పాటు గవర్నర్‌ను కలవనున్నట్లు వివరించారు. భారీ శాంతి ర్యాలీ కోసం జిల్లాల్లో సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ 1న గ్రేటర్ హైదరాబాద్, 2న ఆదిలాబాద్, 3న నిజామాబాద్, 4న కరీంనగర్, 5న వరంగల్, 6న మహబూబ్‌నగర్ జిల్లాల్లో సమావేశాలు, సదస్సులు, సెమినార్లు, ర్యాలీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. పంచాయతీ పరిష్కరించే వ్యక్తులు పెద్ద మనుషుల్లా వ్యవహరించాలే తప్ప గొడవలు పెరిగేలా చేయవద్దని సూచించారు. నాయకుడి హోదాలో ఉన్న వ్యక్తికి ధైర్యం ఉండాలని, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబులో ఆ లక్షణాలు కన్పించడం లేదన్నారు. విభజనపై కాంగ్రెస్ నిర ్ణయానికి ముందు, ఆ తర్వాత వారిద్దరూ వ్యవహరించిన విధానమే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఏర్పాటు నిర్ణయం 2009లోనే జరిగిందని ప్రస్తుత పరిస్థితుల్లో కలిసి ఉండాలని కోరటం మానవత్వంపై దాడి చేసినట్లేనని అన్నారు. రాష్ర్ట విలీన సమయంలో కాళోజీ నారాయణరావు అందుకు సమ్మతించినప్పటికీ ఆ తర్వాత 2-3 ఏళ్లకే విలీనంలోని ఇబ్బందులను గ్రహిస్తూ కవిత రాశారని గుర్తుచేశారు. సీపీఎం మినహా తెలంగాణ ఏర్పాటుకు అంగీకరించిన అన్ని పార్టీలు నేడు ఢిల్లీలో చక్కర్లు కొడుతూ అడ్డుకొనేందుకు నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. టీఎన్జీవో నేత శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో సకలజనుల సమ్మె సందర్భంగా ఉద్యోగుల హాజరుపై రోజుకో బులెటిన్ విడుదల చేసిన ప్రభుత్వం సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె విషయంలో ఎందుకలా చేయడం లేదని ప్రశ్నించారు. టీఎన్జీవో నేత విఠల్ ప్రసంగిస్తూ సీమాంధ్ర ఉద్యమంలోని లగడపాటి రాజగోపాల్, పరకాల ప్రభాకర్, తులసిరెడ్డి ముగ్గురు మూర్ఖులని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సమన్యాయం అంటున్న చంద్రబాబు అధికారంలో ఉండగా ఆ విధానాన్ని ఎందుకు పాటించ లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాధనలో కీలకంగా పోరాడిన ఉపాధ్యాయులంతా శాంతి ర్యాలీలోనూ అగ్రభాగాన ఉండాలని పిలుపును ఇచ్చారు. టీ-యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామిరెడ్డి, పలు సంఘాల నాయకులు ఈ దీక్షలో పాల్గొన్నారు. తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వి. శ్రీనివాస్‌గౌడ్, జేఏసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నాయకులు ఎం. రామచంద్రయ్య, బార్ కౌన్సిల్ సభ్యుడు సునీల్‌గౌడ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నర్సింగ్‌రావు, కార్యదర్శి కృష్ణమూర్తి, న్యాయవాది ఆలేటి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.