రెచ్చగొడుతోంది కిరణే : కోదండరాం | kiran kumar reddy provoking employees, says kodandaram | Sakshi
Sakshi News home page

రెచ్చగొడుతోంది కిరణే : కోదండరాం

Published Wed, Aug 28 2013 3:35 AM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM

రెచ్చగొడుతోంది కిరణే :  కోదండరాం - Sakshi

రెచ్చగొడుతోంది కిరణే : కోదండరాం

డీజీపీ కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు
వారిద్దరికీ పదవుల్లో కొనసాగే నైతిక హక్కు లేదు
ముఖ్యమంత్రిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం
విద్యుత్‌సౌధ వద్ద ఉద్యోగుల ఘర్షణపై ఢిల్లీకి తప్పుడు ఫిర్యాదు చేశారు
సీడ బ్ల్యూసీ నిర్ణయం అమలు ఆలస్యం చేయడం వల్లే ఈ పరిస్థితి
సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు ‘ముల్కీ అమరవీరుల వారం’

 
 సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంశంపై తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే అమలు చేయకపోవడం వల్లే తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత ఉద్యోగుల మధ్య వైషమ్యాలు పెరిగిపోతున్నాయని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. ‘‘సీడబ్ల్యూసీ తీర్మానాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరుతున్నాం. ఇప్పటికే కేబినెట్ తీర్మానం అయిపోయి, అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఉంటే పంచాయితీ ఇక్కడిదాకా వచ్చేది కాదు. దీన్ని వేగంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ సమావేశాల్లోనే బిల్లు పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని తెలిపారు. ై
 
 హెదరాబాద్‌లోని టీఎన్‌జీవోల కార్యాలయంలో మంగళవారం జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ ప్రతినిధులెవరూ హాజరు కాలేదు. భేటీ అనంతరం జేఏసీ, ఉద్యోగ సంఘ నేతలతో కలిసి కోదండరాం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఆలస్యం చేసేకొద్దీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పూనుకొని డీజీపీ దినేష్‌రెడ్డి సాయంతో వైషమ్యాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. గతంలో తాము ముఖ్యమంత్రిని కలిసిన సమయంలో  కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానని చెప్పి, ఇప్పుడు నిర్ణయం వచ్చాక దాన్ని ఆపాలని ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు.
 
 ఆయన సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులకు అండగా ఉంటానని హామీ ఇవ్వడంతోనే పరిణామాలు ఇక్కడిదాకా వచ్చాయన్నారు. రాష్ట్రంలో ప్రజలందరికీ నిష్పక్షపాతంగా బాధ్యత వహించాల్సిన ముఖ్యమంత్రి, అందరికీ సమాన రక్షణ కల్పించాల్సిన డీజీపీ... తెలంగాణ ప్రజలకు రక్షణ ఇవ్వలేకపోతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి, డీజీపీలకు వారి పదవుల్లో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. ముఖ్యమంత్రి వ్యవహారంపై గవర్నర్‌కు వినతిపత్రం ఇవ్వనున్నట్టు కోదండరాం చెప్పారు. విద్యుత్‌సౌధలో ఉద్యోగుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి ఆంధ్ర ప్రాంత నాయకులు ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేయడం తమను విస్మయానికి గురిచేసిందని చెప్పారు. తెలంగాణ ఉద్యోగులపై దాడి జరిగితే, తెలంగాణ ఉద్యోగులే కొట్టినట్టు చిత్రీకరించి, దాని ఆధారంగా ఒక తప్పుడు ఫిర్యాదును ఢిల్లీలో ఇవ్వడం చూస్తుంటే ఆంధ్ర ప్రాంత రాజకీయ నేతలు ఏ స్థాయికి దిగజారిపోయారో అర్థం చేసుకోవచ్చన్నారు.
 
 7న హైదరాబాద్‌లో భారీ ర్యాలీ: తెలంగాణ అంశంపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వేగంగా అమలు చేయాలన్న డిమాండ్‌తో సెప్టెంబర్ 1 నుంచి ఏడో తేదీ వరకు ముల్కీ అమరవీరుల వారంగా పాటించనున్నట్టు కోదండరాం చెప్పారు. 1952 సెప్టెంబర్ 3, 4 తేదీల్లో ‘నాన్ ముల్కీ గోబ్యాక్’ అంటూ జరిగిన ఉద్యమంలో హైదరాబాద్‌లో జరిగిన పోలీసు కాల్పుల్లో  ఏడుగురు మరణించారని, దానికి గుర్తుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ‘‘వెంటనే తెలంగాణ బిల్లు పెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ.. సీమాంధ్ర ప్రజలారా! విభజనకు అంగీకరించండి- శాంతిని కాపాడండంటూ విజ్ఞప్తి చేస్తూ వారం రోజుల పాటు తెలంగాణ సాధన ర్యాలీలు, సభలు, సమావేశాలు, సదస్సులు ఎక్కడికక్కడ ఏర్పాటు చేయండి’’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా 7న హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు. అప్పట్లో పోలీసు కాల్పులు జరిగిన సిటీ కాలేజీ నుంచే ర్యాలీ ప్రారంభమై,బేగంబజార్, గన్ పార్కు, సచివాలయం మీదుగా ఇందిరాపార్కు వద్దకు చేరుకుటుందని, ఆ తరువాత  అక్కడ సభ జరపనున్నట్టు తెలిపారు.
 
 ప్రక్రియ పూర్తికాక ముందే సన్మాన సభలా..
 ముఖ్యమంత్రి నేతృత్వంలోనే తెలంగాణపై తీవ్రస్థాయిలో దాడి జరుగుతుంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలు సన్మాన సభలు నిర్వహించుకోవాలనుకోవడం చాలా అన్యాయమని కోదండరాం అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రక్రియ మొత్తం అమలుల్లోకి రాకుండానే కాంగ్రెస్ నేతలు సభలు నిర్వహించుకోవాలనుకోవడం తొందరపాటు చర్యగా వ్యాఖ్యానించారు. ఉద్యోగులకు అండగా కొందరు కాంగ్రెస్ ఎంపీలు తప్ప.. ఇక్కడి మంత్రులు, ఎమ్మెల్యేలు వారిని విస్మరిస్తున్నారన్నారు. ఈ విషయమై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో చర్చిస్తామన్నారు. జేఏసీ భాగస్వామ్య టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ ప్రజాప్రతినిధులతో సమావేశమై ఉద్యోగులకు అండగా ఉండాల్సిన అంశాలపై చర్చిస్తామన్నారు.
 
మీడియాకువిజ్ఞప్తి..: తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న కార్యక్రమాలకు సమాన ప్రచారం కల్పించాలని కోదండరాం మీడియాకు విజ్ఞప్తి చేశా రు. ఈ అంశంపై గతంలోనే మీడియాకు లేఖ రాయాలనుకున్నామని, కానీ ఆలస్యమైందన్నారు. విద్యుత్  సౌధ వద్ద ఉద్యోగుల ఘర్షణకు సంబంధించిన అంశం తర్వాత తప్పనిసరిగా మీడియాకు లేఖ రాయాలని నిర్ణయానికి వచ్చామన్నారు. వాస్తవాలను వాస్తవాలుగా చూపాలని కోరారు. అవసరమైతే ఎడిటర్లతో ఒక సమావేశం నిర్వహించాలనుకుంటున్నట్టు చెప్పారు.  
 
సీఎంను తప్పించండి: కేటీఆర్
టీఆర్‌ఎస్ రెచ్చగొడుతోందంటూ సీమాంధ్ర ఎంపీలు చెప్పిన మాటలనే దిగ్విజయ్‌సింగ్ ఉటంకించడం భావ్యం కాదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కె.తారక రామారావు అన్నారు. పార్టీ నేతలతో కలిసి మంగళవారం ఆయన తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఏపీ ఎన్జీవోల పేరుతో జరుగుతున్న అల్లరి అంతా ముఖ్యమంత్రి ఆదుపాజ్ఞల్లోనే జరగుతోందన్న విషయం దిగ్విజయ్ తెలుసుకోవాలన్నారు. రాష్ట్రంలో పరిస్థితి అదుపులోకి రావాలంటే సీఎంను అదుపు చేయాలని, లేదంటే పదవి నుంచి తొలగించాలన్నారు. మాజీ ప్రధాని నెహ్రూను ఉద్దేశించి కేసీఆర్ ఒక్క మాటంటేనే, 20 మంది మంత్రులను పక్కన కూర్చోబెట్టుకొని ఎదురుదాడి చేసిన ముఖ్యమంత్రి.. సీమాంధ్ర ఉద్యమం సమయంలో రాజీవ్‌గాంధీ, ఇందిరాగాంధీ విగ్రహాలను ధ్వంసం చేసినా ఎందుకు స్పందించలేదంటూ ప్రశ్నించారు. దిగ్విజయ్ దీనిపై సీఎంను ప్రశ్నించాలన్నారు. సోనియాను ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పరుష వ్యాఖ్యలు చేసినా సీఎం స్పందించని విషయంపైనా నిలదీయాలన్నారు.
 
 సాక్ష్యాలు కేంద్రానికే ఇస్తాం: టీఆర్‌ఎస్
 యూపీఏ, సీడబ్ల్యూసీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న తర్వాత సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఎప్పుడు, ఎక్కడ ఏం మాట్లాడారో.. ఎంత విద్వేషం స్పష్టిస్తున్నారో అన్ని వివరాలను సాక్ష్యాలతో సహా కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని టీఆర్‌ఎస్ పార్టీ శాసనసభాపక్ష ఉప నాయకుడు హరీష్‌రావు చెప్పారు. సీడీలతో సహా అన్ని ఆధారాలను అవసరమైతే రాష్ట్రపతి, ప్రధానికి సమర్పిస్తామన్నారు. టీఆర్ ఎస్ నేతలు ప్రజలను రెచ్చగొడుతున్నారంటూ దిగ్విజయ్‌సింగ్ మాట్లాడడంపై హరీష్‌రావు మండిపడ్డారు. పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి ఆయన మంగళవారం ఉదయం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా శంషాబాద్ విమానశ్రయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర నాయకులు చెప్పిన మాటలనే నమ్మి దిగ్విజయ్... టీఆర్‌ఎస్ కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరడం విచారకరమన్నారు. నిజానికి సంయమనం పాటిస్తున్నది తమ పార్టీయేనన్నారు. కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నప్పట్నుంచీ సీమాంధ్రలోని అన్ని పార్టీల నాయకులు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
 
 బిల్లు ప్రవేశపెట్టే వరకు ఉద్యమం: నాయిని
 హైదరాబాద్, న్యూస్‌లైన్: పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే వరకు ఉద్యమం కొనసాగిస్తామని టీఆర్‌ఎస్ నేత నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. సీమాంధ్ర ఉద్యమాన్ని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వెనుకుండి నడిపిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ నేతలపై అక్కడి ఉద్యమకారులు విచ్చలవిడి దాడులకు పాల్పడుతున్నా, జాతీయ నేతల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నా కేసులు నమోదైన దాఖలా లు లేవన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై మాత్రం ప్రభుత్వం ఇష్టారాజ్యంగా కేసులు నమోదు చేయించిందని దుయ్యబట్టారు. రైల్‌రోకో సందర్భంగా ఆర్పీఎఫ్ పోలీసులు నమోదు చేసిన కేసుపై సికింద్రాబాద్‌లోని రైల్వే కోర్టులో మంగళవారం జరిగిన విచారణకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే పద్మారావులతో కలిసి నాయిని హాజరయ్యారు. ఈ కేసు విచారణను కోర్టు నవంబర్ 29కి వాయిదా వేసింది. అనంతరం నాయిని విలేకరులతో మాట్లాడుతూ తాము రైల్‌రోకోకు పిలుపునిస్తే ప్రభుత్వమే రైళ్లు నిలిపివేసిందని చెప్పారు. పట్టాలే ఎక్కని రైళ్లను తాము అడ్డుకున్నట్టు ప్రభుత్వం కేసులు నమోదు చేయడం ఉద్యమాన్ని నీరుగార్చే కుట్రలో భాగమేనన్నారు. కేసులు ఎత్తివేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ ప్రకటన వెలువడ్డాక కూడా అమలుకు నోచుకోకపోవడం విచారకరమన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement