నిషా ధర.. నషాళానికి!
⇒చుక్కల్లో మద్యం ధరలు క్వార్టర్‌కు రూ.10 అదనం ఫుల్ బాటిల్‌పై రూ.40
⇒ఎక్సైజ్ మంత్రి సొంత ఇలాకాలోనూ ఇష్టారాజ్యంగా విక్రయాలు
⇒24 గంటలూ అందుబాటులో మద్యం బెల్టుషాపుల నిర్వహణ షరా మామూలే
జిల్లాలో మద్యం ధరలు చుక్కలనంటుతున్నాయి. ఎమ్మార్పీ ధరకు మించి యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నారు. జిల్లా అంతటా ఈ పరిస్థితి కొనసాగుతోంది. సాక్షాత్తూ ఎక్సైజ్ మంత్రి సొంత జిల్లా అయినా నిబంధనలను పట్టించుకునే నాథుడే లేడు. అధిక ధరకు విక్రయాలు సాగిస్తున్నా అడిగే పరిస్థితి లేదు. తాజాగా మంత్రి సొంత నియోజకవర్గమైన మచిలీపట్నంలోనూ మద్యం ధరలు ఇష్టారాజ్యంగా పెంచేశారు.
మచిలీపట్నం : ఎక్సైజ్ శాఖ మంత్రి సొంత ఇలాకాలో మద్యం ధరలకు రెక్కలొచ్చాయి. జిల్లాలో యథేచ్ఛగా ఎమ్మార్పీపై క్వార్టర్ బాటిల్‌కి రూ.10 పెంచి విక్రయాలు చేస్తున్నారు. ఫుల్ బాటిల్‌కి ఈవిధంగా రూ.40 అదనంగా వసూలు చేస్తున్నారు. తాజాగా మంత్రి సొంత నియోజకవర్గమైన మచిలీపట్నంలోనూ బరితెగించేశారు. ఐదు రోజుల క్రితం మద్యం సిండికేట్ వ్యాపారులు, మరో ఇద్దరు టీడీపీ కీలక నాయకులు సమావేశమై మద్యం ధరలను పెంచాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా క్వార్టర్ బాటిల్‌కు రూ.10 చొప్పున ధర పెంచేసి విక్రయాలు జరుపుతున్నారు. పట్టణంలోని ఏడు వైన్ షాపులు, పది బార్ అండ్ రెస్టారెంట్లలో ఇవే ధరలు అమలవుతున్నాయి. ఇంతా జరుగుతున్నా ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు.
జిల్లా అంతటా...
జిల్లాలో మొత్తం 334 మద్యం దుకాణాలు ఉండగా, విజయవాడ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయ పరిధిలో 160, మచిలీపట్నం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయ పరిధిలో 174 మద్యం షాపుల వరకు ఉన్నాయి. మచిలీపట్నం ఈఎస్ పోస్టు ఎనిమిది నెలలుగా ఖాళీగానే ఉంది. మచిలీపట్నం సీఐ పోస్టుతో పాటు మచిలీపట్నం ఎక్సైజ్ కార్యాలయ ఏవో పోస్టు ఏళ్ల తరబడి ఖాళీగానే ఉన్నా వీటిని భర్తీ చేయటం లేదు. ఏఈఎస్ ఇన్‌చార్జ్ ఈఎస్‌గా వ్యవరిస్తున్నారు. జిల్లా అంతటా మద్యం ధరలు ఎమ్మార్పీ కంటే అదనంగా పెంచి వసూలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు.
సమయపాలన ఏదీ?
మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లలో 24 గంటలూ మద్యం అందుబాటులో ఉంటోంది. నిబంధనల ప్రకారం వైన్‌షాపు ఉదయం 10 గంటలకు తీసి రాత్రి 10 గంటలకు మూసివేయాలి. బార్ అండ్ రెస్టారెంట్లు ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలి. ఈ నిబంధనలు జిల్లాలో ఎక్కడా అమలుకాని పరిస్థితి నెలకొంది. 24 గంటల పాటు మద్యం విక్రయాలు జరుపుతున్నారు. వీటికి తోడు తెలుగు తమ్ముళ్ల కనుసన్నల్లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో యథేచ్ఛగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. బెల్టు షాపుల్లో క్వార్టర్ బాటిల్‌కు మరో రూ.5 వసూలు చేస్తున్నారు. చింతగుంటపాలెం, కాలేఖాన్‌పేట, గిలకలదిండి, బందరుకోట బైపాస్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో బెల్టుషాపుల నిర్వహణ యథేచ్ఛగా కొనసాగుతోంది. గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.