
టీడీపీ లేకుంటే కేసీఆర్ గొర్రెలు కాసుకునేవాడు..
కాకినాడ : నదుల అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని నీటి ఎద్దడి లేకుండా చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయటానికి నాలుగేళ్లు పడుతుందన్నారు. సముద్రంలోకి వెళ్తున్న వృథా నీటిని వాడుకునేందుకే పట్టిసీమ ప్రాజెక్ట్ చేపడుతున్నామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన చంద్రబాబు కాకినాడలో జిల్లా పర్యాటక సర్క్యూట్ ప్రాజెక్ట్ ప్రారంభించారు.
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ కాకినాడలో పెట్రోలియం యూనివర్శిటీ, రాజమండ్రిలో నర్సరీ రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేస్తామన్నారు. ఉభయ గోదావరి జిల్లాలో దేశానికి ధాన్యాగారాలని ఆయన అన్నారు. నదుల అనుసంధానానికి టీడీపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి కేంద్రాన్ని మధ్యవర్తిత్వం పెట్టుకుందామని తెలంగాణ సీఎం కేసీఆర్కు చెప్పామన్నారు. టీడీపీ లేకపోతే కేసీఆర్ సిద్ధిపేటలో గొర్రెలు కాసుకునేవారిని చంద్రబాబు వ్యాఖ్యానించారు.