ముఖ్య అతిథులుగా త్రిసభ్య కమిటీ సభ్యులు హాజరయ్యారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సాక్షి ప్రతినిధి/కర్నూలు, న్యూస్‌లైన్ : ప్రతిపక్షాన్ని దెబ్బతీయాలనే టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలు ఫలించవని, ఎన్నికల హామీలను నెరవేర్చకపోతే బలహీనపడేది ఆ పార్టీయేనని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యులు విశ్వరూప్, జగ్గారెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సార్వత్రిక, మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో జయాపజయాలపై శుక్రవారం స్థానిక దేవి ఫంక్షన్ హాల్‌లో ఆ పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా త్రిసభ్య కమిటీ సభ్యులు హాజరయ్యారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఎన్నికల ముందు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి మృతికి సంతాపసూచకంగా పార్టీ శ్రేణులు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం త్రిసభ్య కమిటీ సభ్యులు మాట్లాడుతూ టీడీపీ ప్రలోభాలతో ఒకరిద్దరు పార్టీ ఫిరాయించినంత మాత్రాన వైఎస్‌ఆర్‌సీపీ బలహీనపడదని జిల్లా కార్యకర్తలు రుజువు చేశారన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలి చంద్రబాబు మైండ్‌గేమ్‌కు తెరతీశాడన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఆయన నెరవేర్చకపోతే ఆరు నెలల్లో ఆ పార్టీ బలహీనపడటం ఖాయమన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్‌ఆర్‌సీపీ ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రజల తరఫున పోరాటం సాగిస్తుందన్నారు. వైఎస్‌ఆర్‌సీపీకి కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ల నుంచి గుర్తింపు లభించిందన్నారు. ఫలితంగా మండల, జెడ్పీ అధ్యక్ష పదవులతో పాటు
మునిసిపల్ చైర్మన్లకు జరిగే ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థులకే ఓటు వేసేలా విప్ జారీ చేసే అధికారం పార్టీకి లభించిందని గుర్తు చేశారు. కేంద్రంలో లోక్‌సభ కొలువుదీరాక నంద్యాల ఎంపీఎస్పీవై రెడ్డిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరతామన్నారు.
పార్టీ నిర్మాణమే ఎజెండా కర్నూలు, నంద్యాలలో జరిగిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సమావేశం పార్టీ నిర్మాణమే ఎజెండాగా సాగింది. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సాగింది. సార్వత్రిక ఎన్నికలతో పాటు మునిసిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో జయాపజయాలపై నియోజకవర్గాల వారీగా సమీక్షించారు. రాష్ట్రంలో కడప తర్వాత కర్నూలు జిల్లా పార్టీ శ్రేణులు 11 సీట్లను జిల్లాలో కైవసం చేసుకుని పార్టీకి అండగా నిలిచారని ఈ సందర్భంగా త్రిసభ్య కమిటీ సభ్యులు కొనియాడారు.
గెలుపొందిన నియోజకవర్గాల్లో పార్టీకి లభించిన ఓట్ల శాతం, గ్రామాల వారీగా పార్టీ పటిష్టత, సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసిన ముఖ్య అంశాలు, పార్టీలోనే ఉంటూ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసిన నాయకులు తదితర విషయాలపై వేర్వేరుగా నియోజకవర్గ సమావేశాలు నిర్వహించి విశ్లేషించారు. నియోజకవర్గాల్లో పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఎలాంటి చర్యలు అవసరమని భావిస్తున్నారనే విషయంపైనా మండల, నియోజకవర్గ స్థాయి నాయకులు, వైఎస్సార్సీపీ అనుబంధ సంఘాల కన్వీనర్లతో చర్చించి రాత పూర్వకంగా సమీక్ష పత్రాలను తీసుకున్నారు.
సమావేశంలో కర్నూలు, కోడుమూరు, మంత్రాలయం, ఆదోని, నందికొట్కూరు, పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, మణిగాంధీ, బాల నాగిరెడ్డి, సాయి ప్రసాద్‌రెడ్డి, ఐజయ్య, గౌరు చరితారెడ్డి, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, గ్రీవెన్స్ సెల్ జిల్లా కన్వీనర్ తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, ఎమ్మిగనూరు నియోజకవర్గం ఇన్‌చార్జి జగన్‌మోహన్‌రెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా కన్వీనర్ హఫీజ్‌ఖాన్, పులకుర్తి రాజారెడ్డి, కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, నంద్యాల పార్లమెంట్ పరిధిలోని నందికొట్కూరు నియోజకవర్గం, ఓర్వకల్లు, కల్లూరు మండలాలకు సంబంధించిన వైఎస్సార్‌సీపీ నాయకులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.