* మహిళ మరణంపై అనుమానాలు
* రూ.50 వేలు, 13 కాసుల బంగారం చోరీ
ఆకివీడు : ఆకివీడులో ఓ మహిళ వంటింట్లో కాలిపోయి మరణించండంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది దుండగులపనే అయి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. బీరువాలో నగలు, నగదు మాయం కావడంతో ఎవరో చోరీకి వచ్చి హత్యచేసి ఉంటారని పేర్కొంటున్నారు. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. స్థానిక ప్రధాన సెంటర్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఆదర్శ నగర్ కాలనీలో వేగేశ్న వెంకట్రాజు, అతని భార్య భాగ్యలక్ష్మి(56) నివాసం ఉంటున్నారు.
సోమవారం ఉదయం వెంకట్రాజు చేపలచెరువుల దగ్గరకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చాడు. ఈ సమయంలో వంటగదిలో వాసన రావడంతో అక్కడికి వెళ్లి చూడగా భార్య భాగ్యలక్ష్మి శరీరం కాలిపోయి చనిపోయి బోర్లా పడి ఉంది. దీంతో అతను వెంటనే కుమారులు రామరాజు, నాగరాజుకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి గ్యాస్‌లీక్ వల్ల ప్రమాదం సంభవించి ఉంటుందని భావించి దహనసంస్కారాలకు ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకుని ఏఎస్‌ఐ శ్రీనివాస్ రాగా, గ్యాస్ లీక్ అని చెప్పి పంపేశారు. అంత్యక్రియల సమయంలో నోట్లో బంగారం పెట్టే ఆచారం ఉండడంతో కుటుంబసభ్యులు ఇంట్లోని బీరువా తెరిచి బంగారం కోసం చూశారు.
అందులో 13 కాసుల బంగారం, రూ.50వేల నగదు కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఎస్‌ఐ అశోక్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. భీమవరం రూరల్ సీఐ జయసూర్యకు సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చి ముందుగా విషయం తెలిసినప్పుడు ఇంటిని ఎందుకు తనిఖీ చేయలేదని సిబ్బందిపై మండిపడ్డారు. ఇంటిని నీటితో కడిగేశారని, ఇప్పుడు వేలిముద్రలు ఎలా దొరుకుతాయని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలిముద్ర నిపుణులు, డాగ్‌స్క్వాడ్‌ను రప్పించారు.
మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బీరువాలో నగలు, నగదు మాయం కావడాన్ని బట్టి ఇది హత్యేనని అనుమానిస్తున్నట్టు చెప్పారు. అన్నికోణాల్లో విచారణ చేపడతామని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు.
మద్యం సీసా లభ్యం
వంటగదిలో మద్యం సీసా లభించడం పోలీసుల అనుమానానికి బలం చేకూరుస్తోంది. వెంకట్రాజుకు మద్యం తాగే అలవాటు లేదు. అలాంటప్పుడు మద్యం సీసా వంటగదిలోకి ఎలా వచ్చిందని పోలీసులు ఆరా తీస్తున్నారు. భాగ్యలక్ష్మి పీకనొక్కి ఆ తర్వాత మద్యం శరీరంపై పోసి నిప్పంటించి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
చోరీకి వచ్చి చంపేశారు!
Published Tue, Apr 19 2016 4:35 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
Advertisement