ఇంటి విషయంలో అంతా ఆమెదే పెత్తనం. ఇంట్లో ఏ చిన్న విషయం జరిగినా ఆమెకు తెలియాల్సిందే. నగదు లావాదేవీలు, పిల్లల పెంపకం, వ్యవసాయ పనులు.. ఇలా ప్రతి విషయం ఆమె కనుసన్నల్లో జరిగేవి. ఇంటి వ్యవహారాలన్నింటినీ అంతా తానై నడిపించేది. ఈక్రమంలో వదినపై కూడా పెత్తనం చలాయించేది. ఇదే ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది. ఆడబిడ్డ పెత్తనం సహించలేని వదిన ఆమెను మరో వ్యక్తితో కలిసి అంతమొందించింది.
సాక్షి, శిరివెళ్ల(కర్నూల్): గోవిందపల్లెలో గత ఆదివారం జరిగిన మహిళ హత్య కేసులో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. గురువారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో డీఎస్పీ చక్రవర్తి వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన గంగదాసరి బాల నరసింహారెడ్డితో 15 ఏళ్ల క్రితం ఇందిరమ్మకు వివాహమైంది. కుటుంబంలో కలహాలు రావడంతో ఆమె 12 ఏళ్లుగా పుట్టింటిలో తల్లి చిన్న లక్ష్మమ్మ, అన్న వెంకటేశ్వరరెడ్డి, వదిన సునీతతో కలిసి ఉండేది.
మాటలతో వేధించేది..
ఈ క్రమంలో వదినను సూటిపోటి మాటలతో వేధించేది. దీనికితోడు తన అత్తకు చెందిన ఆస్తి, కుటుంబ పెత్తనమంతా హతురాలి చేతిలో ఉండేది. దీంతో ఎలాగైనా ఆమెను కడతేర్చాలని సునీత భావించింది. ఈక్రమంలో తన ప్రియుడు గోస్పాడు మండలం దీబగుంట్లకు చెందిన కాకనూరు సుబ్బారెడ్డితో హత్యకు పథకం వేసింది. గత ఆదివారం( ఈనెల 17న) తెల్లవారుజామున ఇంటిలో ఎవరూలేని సమయంలో నిద్రలో ఉన్న ఇందిరమ్మను ప్రియుడితో కలిసి హతమార్చింది. ఇద్దరూ కలిసి దిండుతో ముఖంపై పెట్టి ఊపిరాడకుండా చేసి అంతమొందించారు.
ఆ తర్వాత ఆమె ఒంటిపై ఉన్న 6 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ప్రత్యేక పోలీసు బృందం గోస్పాడు మండలం సాంబవరం మెట్ట కాశిరెడ్డి నాయన ఆశ్రమం వద్ద నిందితులను అరెస్ట్ చేసింది. ఈసందర్భంగా వారి నుంచి 2 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుంది. కేసు ఛేదించడంలో కీలకపాత్ర పోషించిన సీఐ యుగంధర్, శిరివెళ్ల, గోస్పాడు, సంజామల ఎస్‌ఐలు సుధాకరరెడ్డి, హనుమంతయ్య, విజయభాస్కర్‌ను డీఎస్పీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment