సాక్షి, హైదరాబాద్: తిరుమలగిరి పోలీసుస్టేషన్ పరిధిలో గత గురువారం జరిగిన మహిళ దారుణ హత్య కేసును ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఛేదించారు. ఆమె ఒంటిపై ఉన్న సొత్తు కోసం పరిచయస్తుడైన వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేల్చిన పోలీసులు అతడిని పట్టుకున్నారు. నిందితుడైన దండు రాముడు అలియాస్ కూర్మను అరెస్టు చేసినట్లు నార్త్‌జోన్ డీసీపీ జి.చందనా దీప్తి మంగళవారం వెల్లడించారు.
మహబూబ్‌నగర్ జిల్లా, బండ్రావల్లికి చెందిన కూర్మ తొలినాళ్లల్లో తన స్వస్థలంలోనే కూలీగా జీవనం సాగించాడు. ఆపై తెలుగు గంగ కాలువ పనుల కోసం కుటుంబంతో సహా కర్నూలు జిల్లాకు వలసవెళ్లాడు. మూడేళ్ల క్రితం నగరానికి వచి్చన అతగాడు సికింద్రాబాద్‌లోని ఓ లాడ్జిలో నెలకు రూ.3 వేల జీతానికి పని చేశాడు. అప్పట్లో ఇతడికి తన సహోద్యోగినితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. దీంతో ఆమె పేరుతో తన కుడి చేతిపై పచ్చ»ొట్టు వేయించుకున్నాడు. అనివార్య కారణాల నేపథ్యంలో ఆమె దూరం కావడంతో కూర్మ మద్యానికి బానిసగా మారాడు.
నిర్మాణ రంగంలో కూలీగా మారిన ఇతగాడు ఆ పనుల కోసం కామారెడ్డితో పాటు కర్నూలు, అనంతపురం, ప్రకాశం జిల్లాలకు వెళ్లి వస్తుండేవాడు. ప్రస్తుతం బోయిన్‌పల్లిలో ఉంటున్న అతడికి అక్కడి కూరగాయల మార్కెట్‌లో పని చేసే రత్లావత్ దేవమ్మతో పరిచయమైంది. ఇద్దరూ కలిసి తరచు కల్లు కాంపౌండ్లకు వెళ్లి కల్లు తాగేవారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆఖరణాలపై కన్నేసిన అతను గత గురువారం పథకం ప్రకారం బోయిన్‌పల్లి ఆర్టీసీ కాలనీలోని కాంపౌడ్‌కు తీసుకువెళ్లి ఎక్కువ కల్లు తాగించాడు. మత్తులో ఉన్న ఆమెను తిరుమలగిరి ఎల్‌ఐసీ చౌరస్తా సమీపంలోని ఖాళీ స్థలంలోకి తీసుకువెళ్లాడు.
అక్కడే పిడిగుద్దులు గుద్ది కింద పడిపోయేలా చేశాడు. అచేతనంగా పడి ఉన్న ఆమెపై కూర్చున్న కూర్మ తన వద్ద ఉన్న బ్లేడ్‌తో గొంతు కోసి చంపేశాడు. అనంతరం ఆమె వద్ద ఉన్న రూ.8 వేల నగదు, పుస్తెల తాడు, కాళ్ల పట్టీలు తేలిగ్గానే అతడి చేతికి చిక్కినా చెవులకు ఉన్న కమ్మెలు మాత్రం తీయడం కష్టమైంది. దీంతో ఏకంగా చెవుల కింది భాగాన్ని కోసేసి దాంతో సహా కమ్మెలు పట్టుకుపోయాడు. దేవమ్మ హత్యపై తిరుమలగిరి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రంగంలోకి దిగిన టాస్‌్కఫోర్స్ పోలీసులు నిందితుడిని పట్టుకుని సొత్తు రికవరీ చేయడంతో పాటు అతడిని తిరుమలగిరి పోలీసులకు అప్పగించారు.
(చదవండి: అంబులెన్స్ దొంగ అరెస్టు)
Comments
Please login to add a commentAdd a comment