భర్త మద్యం మత్తులో కుటుంబాన్ని పట్టించుకోకపోవడాన్ని అలుసుగా తీసుకున్న మరిది, ఆడపడుచు కుమారుడు తనను లైంగికంగా వేధిస్తున్నారని రంగారెడ్డి జిల్లా పరిగి పట్టణానికి చెందిన వివాహిత అస్రా బేగం గురువారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది. వేధింపులపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, తక్షణమే తనను వేధిస్తున్న వారిపై చర్యలకు అదేశించాలని ఆమె విజ్ఞప్తి చేసింది. బాధితురాలి కథనం ప్రకారం.. పదేళ్ల్ల క్రితం అస్రాబేగంను గాజుల బస్తీ నివాసి మహ్మద్ ఖదీర్‌ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండేళ్ల వరకు కాపురం సజావుగానే సాగింది.
ఎనిమిదేళ్ల క్రితం మద్యానికి బానిసైన భర్త అస్రాను వేధించసాగాడు. అయినా ఓర్చుకుంది. స్థానికంగా గాజుల షాపు నిర్వహిస్తూ పిల్లలను సాకుతోంది. అస్రాను భర్త పట్టించుకోకపోవడాన్ని అలుసుగా తీసుకుని, మరిది అసద్, ఆడపడుచు కుమారుడు అబ్బు అసభ్యంగా ప్రవర్తించసాగారు. తమతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని వేధిస్తున్నారు. ఇటీవల వాళ్లిద్దరు తన ఇంటికి వచ్చి లైంగిక దాడికి యత్నించినట్లు తెలిపింది. ఈవిషయమై అసద్, అబ్బును తన తమ్ముళ్లు నిలదీయగా వారిపై దాడి చేసినట్లు తెలిపింది. భర్త కూడా లైగింక వేధింపులను తప్పుపట్టకుండా తనపైనే అసత్య ప్రచారం చేస్తూ ఇంటికి రాకుండా తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడని వాపోయింది.
అత్త రాజకీయ నాయకురాలవడంతో ఆమె పలుకుబడితో పోలీసులు కేసును పట్టించుకోవడం లేదని కన్నీటిపర్యంతమైంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భర్త, అత్త, కుటుంబీకులు ఏ క్షణమైనా పిల్లలతో ఒంటరిగా ఉంటున్న తనపై దాడి చేసే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. తనను వేధిస్తున్న మరిది, ఆడపడుచు కుమారుడిపై చర్య తీసుకొని తనకు రక్షణ కల్పించాలని వివాహిత మానవ హ క్కుల కమిషన్‌ను వేడుకుంది.
నివేదిక అందించాలని ఎస్పీకి ఆదేశం
అస్రాబేగంను వేధిస్తున్న విషయమై సమగ్ర విచారణ జరిపి జనవరి 20 తేదిలోపు నివేదిక సమర్పించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ రంగారెడ్డి జిల్లా ఎస్పీని అదేశించారు. బాధితురాలి కుటుంబానికి రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
మరిది వేధింపులపై హెచ్‌ఆర్సీని ఆశ్రయించిన వివాహిత
Published Fri, Dec 6 2013 8:57 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement