
సీఐ మహేశ్వరెడ్డికి విన్నవిస్తున్న అత్త నాగరాణి
రాయచోటి టౌన్ : కట్టుకున్న భర్తను.. కన్న బిడ్డలను కాదని ఎటో వెళ్లిపోయిన ఆ మహిళకు కనువిప్పు కలిగింది. నేను పొరబాటు చేశాను.. నాకు నా బిడ్డలు కావాలి.. నేను తిరిగి వచ్చేంత వరకు వాళ్లను మా అత్తకు అప్పగించండి.. అంటూ పోలీసులకు మొర పెట్టుకుంది. వివరాల్లోకి వెళితే.. రాయచోటి కృష్ణాపురానికి చెందిన భారతి అనే మహిళ తన భర్తతో పాటు కువైట్‌లో ఉండేది. వారి పిల్లల ఆలనా పాలనా పిల్లల అవ్వా,తాతలు చూసుకునేవారు. ఈ నేపథ్యంలో కువైట్‌లో ఉంటున్న పిల్లల తల్లి ఉన్నట్లుండి భర్తకు తెలియకుండా, సేఠ్‌కు చెప్పకుండా పాస్‌పోర్టు తీసుకుని ఎటో వెళ్లిపోయింది. నీకు తెలియకుండా నీ భార్య ఎక్కడికి వెళ్లింది అంటూ సేఠ్ ఆమె భర్తను నిలదీశాడు. ఈ పరిస్థితుల్లో తన కోడలు ఎక్కడికి వెళ్లిందో.. తన కుమారుడిని సేఠ్ ఏం చేస్తాడో అనే భయంతో భారతి అత్త నాగరాణి రాయచోటి నుంచి కువైట్‌కు బయలుదేరాలని నిర్ణయించుకుంది. అంతవరకు ఆ బిడ్డల ఆలనా పాలనా చూస్తున్న అవ్వాతాతలు తమ కూతురే కనిపించకుండా పోయినప్పుడు ఇక ఆ పిల్లలు తమకెందుకు అంటూ నాగరాణికి అప్పగించేశారు.
తాను కొడుకు వద్దకు కువైట్‌కు వెళ్లాలనుకుంటున్నానని.. ఇప్పుడు ఈ పిల్లలను నాకు అప్పగిస్తే ఏం చేయాలని..నాగరాణి పోలీసులను ఆశ్రయించి వారి ద్వారా చైల్డ్ వెల్ఫేర్ సొసైటీకి అప్పగించింది. దీనిపై ఇటీవల సాక్షి దినపత్రికలో ‘నాన్న కష్టాల్లో.. అమ్మ అజ్ఞాతంలో.. ’ అనే శీర్షికన కథనం ప్రచురితమైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో కువైట్‌లో కనిపించకుండా పోయిన పిల్లల తల్లి భారతి రాయచోటిలో జరిగిన ఈ సంఘటనను సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంది. వెంటనే ఆమె కువైట్ నుంచి తల్లిదండ్రులతో మాట్లాడింది. దీంతో వీరు కువైట్‌లో ఉన్న తమ కుమార్తెను ఇక్కడికి రప్పించేందుకు తమకు తెలిసిన వారి ద్వారా తిరుగు ప్రయాణానికి టిక్కెట్ తెప్పించారు. అయితే అప్పటికే కువైట్‌లో ఉన్న సేఠ్ ఆమె అకామా ( పర్మీషన్) రద్దు చేయడంతో ఎయిర్ పోర్టులో పట్టుబడింది. ఈ విషయం ఆమె భర్తకు తెలియడంతో వెంటనే ఎయిర్ పోర్టుకు వెళ్లి అక్కడి సేఠ్ ద్వారా పలుకుబడి ఉపయోగించి ఆమెను చిక్కుల్లో నుంచి బయటకు తీసుకొచ్చాడు. ఈ క్రమంలో మంగళవారం ఆమె కువైట్ నుంచి రాయచోటి అర్బన్ సీఐ మహేశ్వరరెడ్డికి ఫోన్ చేసి తాను తప్పు చేశానని.. తనకు బిడ్డలు కావాలని.. వారిని చైల్డ్ వెల్ఫేర్ సొసైటీ నుంచి తీసుకొచ్చి తన అత్తకు అప్పగించాలని మొరపెట్టుకుంది. ఈమేరకు సీఐ ఆమె అత్త, తల్లిదండ్రుల నుంచి రాతపూర్వకంగా రాయించుకుని ఆమె పిల్లలను తీసుకొచ్చేందుకు తన వంతు సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఈ తతంగం పూర్తి కావాలంటే సుమారు ఐదు నెలలు పట్టవచ్చని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment