ద్వారకానగర్ (విశాఖ దక్షిణ) : సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మను తక్షణమే అరెస్ట్ చేయాలని కోరుతూ రెండోరోజు గురువారం కూడా మహిళా సంఘాలు తమ దీక్ష కొనసాగించాయి. వర్మకు వ్యతిరేకంగా మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ పార్కులో మహిళా సంఘాలు 48 గంటల నిరహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దర్శకుడు వర్మపై ఎంవీపీ జోన్ పోలీసు స్టేషన్‌లో సెక్షన్ 504, 509 కింద కేసులు నమోదయ్యాయి. అయితే, తెలంగాణ తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్మపై సెక్షన్ 306, 354 ఏ, 67 ఐటీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ డిమాండ్ చేస్తున్నాయి.
‘గాడ్ సెక్స్ ట్రూత్’ పేరిట వర్మ వివాదాస్పద సినిమా తీయడం.. ఈ సినిమాపై టీవీ చర్చల సందర్భంగా మహిళా సంఘాల నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వివాదం తీవ్ర రూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన కేసులలో ఇప్పటికే హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు వర్మను సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఏపీలోనూ వర్మపై కేసులు నమోదుకావడం ఆయనకు మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తోంది. రాంగోపాల్‌వర్మను తీవ్రంగా శిక్షించాలని, లైంగిక స్వేచ్ఛ మహిళలకు కావాలని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
అతనిపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేయాలన్నారు. మహిళా సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు మణి, లక్ష్మి, విమల, మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ నాయకురాలు పసుపులేటి ఉషాకిరణ్ మాట్లాడుతూ, మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వర్మ వ్యాఖ్యానాలు చేస్తున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో మహిళాలపై దాడులు, చిన్నారులపై హత్యలు, యువతులపై అత్యాచారాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు శ్రీదేవి వర్మ, షబీరా బేగం, శశికళ, పీవోడబ్ల్యూ నేతలు, పలు సంఘాల మహిళలు పాల్గొన్నారు. కాగా, వర్మపై ఐద్వా మహిళా సంఘం నాయకురాలు మణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంవీపీజోన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment