సాక్షి, ద్వారకానగర్ (విశాఖపట్నం) : వివాదాస్పద అంశాలతో వార్తల్లో నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మను తక్షణమే అరెస్ట్ చేయాలని కోరుతూ విశాఖలో మహిళా సంఘాలు కొనసాగించిన దీక్షపై పోలీసులు ఎట్టకేకలకు స్పందించారు. దర్శకుడు వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో మహిళా సంఘాలు తమ నిరాహార దీక్షను ముగించారు. అయితే వారం రోజుల్లోగా రాంగోపాల్ వర్మను అరెస్ట్ చేయకపోతే మళ్లీ ఆందోళన చేపడతామని మహిళలు తెలిపారు.
కాగా, వర్మకు వ్యతిరేకంగా మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ పార్కులో మహిళా సంఘాలు 48 గంటల నిరహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే డైరెక్టర్ వర్మపై ఎంవీపీ జోన్ పోలీసు స్టేషన్‌లో సెక్షన్ 504, 509 కింద కేసులు నమోదయ్యాయి. అయితే, తెలంగాణ తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్మపై సెక్షన్ 306, 354 ఏ, 67 ఐటీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. మహిళల దీక్షతో ఎట్టకేలకు పోలీసులు మరిన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.
‘గాడ్ సెక్స్ ట్రూత్’ పేరిట వర్మ వివాదాస్పద సినిమా తీయడంతో పాటు టీవీ చర్చలలో మాట్లాడుతూ మహిళా సంఘాల నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఇప్పటికే హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి వర్మను సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈ క్రమంలో ఏపీలోనూ వర్మపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment