పద్నాలుగేళ్ల పోరాటం.. బతికేందుకు ఆరాటం  | Women Suffering With Cancer Facing Lot Of Problems In Uravakonda | Sakshi
Sakshi News home page

పద్నాలుగేళ్ల పోరాటం.. బతికేందుకు ఆరాటం 

Published Thu, Jul 18 2019 8:36 AM | Last Updated on Thu, Jul 18 2019 8:36 AM

Women Suffering With Cancer Facing Lot Of Problems In Uravakonda  - Sakshi

పాండవులు పన్నెండేళ్లు వనవాసం చేస్తే... ఓ తల్లి కష్టాలతో పద్నాలుగేళ్లుగా సహవాసం చేస్తోంది. బిడ్డ, అల్లుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందగా.. అనారోగ్యంతో 14 సంవత్సరాల మనవడు అచేతనంగా మారాడు. అయినా గుండెదిటువు చేసుకుని ముందుకే సాగింది. కానీ పగబట్టిన మృత్యువు ఆమె కోడలిని కబలించగా.. ఆసరాగా నిలిచిన కుమారుడు మంచం పట్టాడు. అప్పటికీ దయ చూపని దేవుడు... ఆమెను కేన్సర్‌ జబ్బుబారిన పడేశాడు. గత ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్‌ వైద్యసేవ ఆదుకోకపోవడంతో శక్తికి మించి అప్పులు చేసి చికిత్స చేయించుకుంది. అయినా ఫలితం దక్కలేదు. సర్వమూ కోల్పోయిన ఆమె... సాయం చేసే ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది.                          

సాక్షి,ఉరవకొండ(అనంతపురం) : ఉరవకొండ పట్టణానికి చెందిన సుంకన్న, సుజాతమ్మ దంపతులకు కుమారుడు బాలరాజు, కుమార్తెలు శ్రీలత, కవిత సంతానం. పాల విక్రయంతో జీవనం సాగించే సుజాతమ్మ ఉన్నంతలో కుటుంబాన్ని గుట్టుగా నెట్టుకొచ్చేది. పెద్ద కుమార్తె శ్రీలతకు పదేళ్ల క్రితం కూడేరు మండలం జల్లిపల్లి గ్రామానికి చెందిన ఎర్రిస్వామి కుమారుడు విశ్వనాథ్‌కిచ్చి పెళ్లి చేసింది. కూతురుకు తొలికాన్పులోనే కొడుకు పుట్టగా సంబరపడిపోయింది. పవన్‌ అని పేరుపెట్టుకుని అపురూపంగా చూసుకుంది. కానీ ఆ చిన్నారికి తలలో ఉమ్మునీరు చేరి తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. దీంతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ వైద్యం చేయిస్తూ వచ్చింది.  

కూతురు అల్లుడుని కబలించిన రోడ్డు ప్రమాదం 
2013 డిసెంబర్‌లో ద్విచక్రవాహనంపై అనంతపురానికి బయలుదేరిన సుజాతమ్మ కూతురు శ్రీలత, అల్లుడు విశ్వనాథ్‌ మార్గమధ్యలో ట్రాక్టర్‌ ఢీకొని దుర్మరణం చెందారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారి కుమారుడు పవన్‌ పోషణ భారం ఆమెపై పడింది. అయితే ధైర్యం కోల్పోని సుజాతమ్మ తన సంపాదనలో కొంత పవన్‌కు వైద్యం చేయించేందుకు ఖర్చుపెడుతూ వస్తోంది. హైదరాబాద్, కర్నూలు ఆస్పత్రుల చుట్టూ తిరిగి దాదాపు రూ. లక్షల్లో ఖర్చు చేసింది. 

ఆపరేషన్‌ వికటించి అంధుడిగా మారిన పవన్‌ 
ఓ రోజు పవన్‌ పరిస్థితి విషమించడంతో సుజాతమ్మ కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లింది. పరీక్షించిన వైద్యులు పవన్‌కు ఆపరేషన్‌ చేయాలని రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. దీంతో కుటుంబానికి జీవనాధారంగా ఉన్న మూడు ఎనుములను అమ్మి మనవడు పవన్‌కు 2016లో ఆపరేషన్‌ చేయించింది. ఆపరేషన్‌ అయిన మూడు నెలలకే పవన్‌ కాళ్లు, చేతులు వంకర పోయి, మూర్చ వ్యాధి వచ్చింది. కళ్లు కూడా కన్పించకపోవడంతో మళ్లీ కర్నూలులోని ఆస్పత్రికి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు ఆపరేషన్‌ వికటించి పవన్‌ పూర్తిగా కంటి చూపు కోల్పోయినట్లు ధ్రువీకరించారు. తిరిగి వైద్యం చేయాలని అందుకు బాగా ఖర్చవుతుందని తెలిపారు. 

సుజాతమ్మపై కేన్సర్‌ పిడుగు 
మనవడిని బతికించుకునేందుకు ఉన్నదంతా అమ్మి రూ.7 లక్షల వరకు అప్పుల ఊబిలో కూరుకుపోయిన సుజాతమ్మపై విధి మరోసారి కేన్సర్‌ రూపంలో పంజా విసిరింది. ఓ రోజు ఛాతిలో నొప్పిగా ఉండటంతో సుజాతమ్మ స్థానిక వైద్యులకు చూపించింది. వారు కేన్సర్‌  అన్న అనుమానంతో అనంతపురం వెళ్లాలని సూచించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు రొమ్ము కేన్సర్‌ అని ధ్రువీకరించారు. వ్యాధి సోకి చాలా ఏళ్లు అయ్యిందని, వెంటనే ఆపరేషన్‌ చేసుకోకపోతే ప్రాణానికే ప్రమాదమని హెచ్చరించారు.

దీంతో ఆమె అప్పట్లో ఎన్టీఆర్‌ వైద్యసేవకు దరఖాస్తు చేసుకుంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఆస్పత్రులకు డబ్బులు చెల్లించకపోవడంతో ఎన్టీఆర్‌ వైద్యసేవ కింద ఆపరేషన్‌ చేసేందుకు వైద్యులు నిరాకరించారు. ఏం చేయాలో తెలియని సుజాతమ్మ... రూ 2 లక్షలకు ఇంటిని తాకట్టు పెట్టి ఆపరేషన్‌ చేయించుకుంది. అయినా సుజాతమ్మ ఆరోగ్యం కుదట పడలేదు. ప్రాణాపాయస్థితిలో ఉన్న మనవడిని కాపాడుకోలేక, తన ఆరోగ్యాన్ని సంరక్షించుకోలేక నరకయాతన అనుభవిస్తోంది.  

కోడలు మృతి... మంచం పట్టిన కుమారుడు 
ఓవైపు తీవ్ర అనారోగ్యం... మరోవైపు అచేతనంగా మారిన మనవడు... ఇంకోవైపు రుణదాతల ఒత్తిళ్లతో సుజాతమ్మ సతమతమవుతోంది. ఇలాంటి తరుణంలోనే సుజాతమ్మ కుమారుడు బాలరాజు భార్య శ్రీదేవి హృద్రోగంతో కన్ను మూసింది. రూ.2 లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించినా ఆమె ప్రాణాలు దక్కలేదు. భార్య మృతితో బాలరాజు మనోవేదనతో మంచం పట్టాడు. ఈ పరిస్థితుల్లో 70 ఏళ్ల వృద్ధుడైన సుజాతమ్మ భర్త సుంకన్న శక్తిలేకపోయినా కుటుంబాన్ని పోషించేందుకు కూలి పనులకు వెళ్తున్నాడు. 

రూ. 20 లక్షల అప్పులు 
సుజాతమ్మ తన కేన్సర్‌ చికిత్స, మనవడి, కోడలి వైద్యం కోసం శక్తికి మించి ఖర్చు చేసింది. అంతా కలిపితే రూ.20 లక్షలకు చేరింది. ఇంటిపై చేసిన అప్పులు వడ్డీతో సహా రూ.4 లక్షలకు పైగా చేరింది. బయట వ్యక్తుల వద్ద చేసిన అప్పులు మరో రూ.6 లక్షలు ఉన్నాయి. సుజాతమ్మ బతికుండగానే ఉన్న ఇంటిని ఇలాగైనా రాయించుకోవాలని రుణదాతలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement