రాప్తాడు మండల పరిధిలోని దుర్గాబాయి దేశముఖ్ శిశు వికాస కేంద్రం (మహిళా ప్రాంగణం-స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం)లోని ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది.
రాప్తాడు, న్యూస్‌లైన్: రాప్తాడు మండల పరిధిలోని దుర్గాబాయి దేశముఖ్ శిశు వికాస కేంద్రం (మహిళా ప్రాంగణం-స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం)లోని ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. స్వయం శిక్షణ కేంద్రానికి చెందిన 10.50 ఎకరాల్లో 3.50 ఎకరాల్లో భవనాలు, వసతి గృహలను నిర్మించారు. మిగతా 7 ఎకరాల స్థలం ఖాళీగా ఉంది. అప్పట్లో ఆ ప్రాంతంలో ఎవరూ ఉండేవారు కాదు. కాలక్రమేణా స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం చుట్టూ కాలనీలు ఏర్పడ్డాయి. ఇదే అదునుగా భావించిన అధికార పార్టీకి చెందిన మంత్రి అనుచరులు స్వయం శిక్షణ కేంద్రం చుట్టూ బండలు ఏర్పాటుచేసి దాదాపుగా రెండు ఎకరాలు కబ్జా చేశారు. ఈ భూమి రూ. 2 కోట్ల విలువ చేస్తుంది. కొందరు నేతలు ఏకంగా ఇళ్లు నిర్మించేందుకు సన్నాహాలు ప్రారంభించారు.
భూమి కబ్జా కాకుండా ఉండేందుకు మహిళా ప్రాంగణం చుట్టూ ప్రహరీని నిర్మించేందుకు అధికారులు రూ.6 లక్షలు జెడ్పీ నిధులను మంజూరు చేశారు. మహిళా ప్రాంగణం మేనేజరు నాగమని ప్రహరీ నిర్మాణాన్ని మొదలు పెట్టారు. దీనిని అధికారపార్టీ నేతలు అడ్డుకున్నారు. ప్రహరీ నిర్మిస్తే ఆత్మహత్యలు చేసుకుంటామని అధికారిని బ్లాక్‌మెయిల్ చేసినట్లు సమాచారం. ఈ విషయంపై మేనేజర్ నాగమణిని ప్రశ్నించగా ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైనది నిజమేనన్నారు. ప్రహరీ నిర్మాణాన్ని కొందరు అడ్డుకున్నారని, దీనిపై తహశీల్దార్‌కు, ఎస్‌ఐకి ఫిర్యాదు చేసినట్లు ఆమె వివరించారు.