
మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా..
పత్తికొండ అర్బన్: మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా.. అంతరిక్షంలోకి వెళ్లొస్తున్నా.. ఇప్పటికీ పలువురు పతుల చాటునే మిగిలిపోతున్నారు. ప్రజాతీర్పును గౌరవించాల్సిన భర్తలు.. వారిని వంటింటికే పరిమితం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనప్పటికీ పలువురు మహిళా నేతల స్థానంలో భర్తలు పెత్తనం చెలాయిస్తుండటంతో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోంది. శుక్రవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ పరిపాలనపై పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లకు అవగాహన సదస్సు నిర్వహించారు.
సమావేశానికి అధిక శాతం మహిళా సర్పంచ్‌ల స్థానంలో భర్తలు, కుటుంబ సభ్యులు హాజరు కావడం ఆశ్చర్యానికి గురిచేసింది. కోతిరాళ్ల శిరీష, హోసూరు వాకిట శారద, మండగిరి రసూల్‌బీ, పులికొండ రంగమ్మ, చిన్నహుల్తి హుల్తెమ్మ స్థానంలో వారి సంబంధీకులు హాజరయ్యారు. మహిళలు వంటింటి పరిమితమనే భావన ఎప్పటికి తొలగిపోతుందో.. వారిలో చైతన్యం ఎప్పుడొస్తుందో.. వేచి చూడాల్సిందే.