
గ్రామాల్లో అంతా పెదరాయుళ్లు, పాపారాయుళ్లే! మగాడిదే రాజ్యం. ఇంట్లో అయినా,పంచాయతీలో అయినా రాయుళ్లదే శాసనం. ఆడవాళ్లకు మాట్లాడే చాన్స్ ఉండదు. అయితే ఈ ఏడుగురు యువతులు.. సర్పంచ్ అనే మీనింగ్‌కి చలాన్ రాసి పడేశారు. సర్పంచ్ పదవికే గౌరవం తెచ్చారు. ఊరికి నవశకం తెచ్చారు. తీర్పులిచ్చే పీఠాన్ని కాలితో తన్నేసి, మార్పు కోసం బాధ్యత అనే తట్టల్ని నెత్తికి ఎత్తుకున్నారు. కండువాను గిరగిర తిప్పి మెడలో వేసుకోడానికి కాకుండా, శ్రమకు చిందిన నుదిటి స్వేదాన్ని తడుచుకోడానికి మాత్రమే భుజంపై వేసుకున్నారు.
చావీ రజావత్ (36), రాజస్తాన్
దేశంలో అందరికీ తెలిసిన మహిళా సర్పంచ్. పేరున్న టెలికం కంపెనీలో పెద్ద ఉద్యోగం వదిలిపెట్టి ‘సోడా’ గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డారు. గెలిచారు. 2010లో చావీ సర్పంచ్ అయ్యారు. స్వచ్ఛమైన తాగు నీరు, సౌరశక్తి; రోడ్లు, మరుగుదొడ్ల నిర్మాణం, బ్యాంక్.. ఇవన్నీ చావీ తన గ్రామానికి సాధించిపెట్టారు. సర్పంచ్ అయిన రెండో ఏడాదే ఆమె ఐక్యరాజ్యసమితి ‘ఇన్ఫోపావర్టీ వరల్డ్ కాన్ఫరెన్స్’కి ప్రతినిధిగా వెళ్లారు!
షహనాజ్ ఖాన్ (24), హరియాణా
ఈ ఏడాదే, మార్చిలో షెహనాజ్ సర్పంచ్ అయ్యారు. భరత్‌పూర్ పరిధిలోని గర్హజాన్ గ్రామం అది. షెహనాజ్ ఎం.బి.బి.ఎస్. చదివారు. మొత్తం మేవాత్ ప్రాంతానికే అతి చిన్న వయస్కురాలైన సర్పంచ్. తొలి మహిళా సర్పంచ్ కూడా. గర్హజాన్ చరిత్రలోనే అందరి కన్నా ఎక్కువ చదువుకున్న అమ్మాయి షెహనాజ్. గ్రామంలో వ్యాధులను నివారించడానికి శుభ్రత, పారిశుద్ధ్యంపై ఆమె ఎక్కువ దృష్టిపెట్టారు. మేవాత్‌లో ఎవ్వరూ తమ ఆడపిల్లల్ని బడికి పంపించరు. వాళ్లలో మార్పు తేవడం కోసం షెహనాజ్ ఇంటింటికీ వెళ్లి, ‘నన్ను చూడండి’ అని గ్రామస్తులను, బాలికలను మోటివేట్ చేశారు. చదువులో ఎంత శక్తి ఉందో తననే ఒక ఉదాహరణగా చూపుకున్నారు.
అత్రం పద్మాబాయి (38), తెలంగాణ
పద్మాబాయి 2013లో బ్యాంకు నుంచి 30 వేల రూపాయల రుణం తీసుకుని ఆ డబ్బుతో కార్మికుల వెట్టి చాకిరీ తగ్గించే పరికరాల తయారీని ప్రారంభించారు. అలా తయారైన వేట కొడవళ్లు, చిన్న గొడ్డళ్లు, తాపీలు, గడ్డపారలను ప్రభుత్వం కొనుగోలు చేసి.. చుట్టుపక్కల గ్రామాల్లోని పేద కార్మికులు, కర్షకులకు కూడా తక్కువ ధరకు (రోజుకు 2 నుంచి 5 రూపాయలు) అద్దెకు దొరికే సౌలభ్యం కలిగించారు. పద్మాబాయి పటేల్‌గూడా సర్పంచ్. ఆ గ్రామానికి, మరో రెండు ఊళ్లకు సిమెంట్ రోడ్లు వేయించారు. వర్షపు నీటిని నిలవ ఉంచే కుంటల తవ్వకం కోసం ప్రభుత్వ అనుమతి తెప్పించుకున్నారు. ఊళ్లోని పాఠశాలకు మంచి నీటి సదుపాయం ఏర్పాటు చేయించారు.
ఆర తీదేవి (28), ఒడిశా
మొదట్లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్. దాన్నొదిలిపెట్టి ధుంకపర గ్రామ సర్పంచ్‌గా వచ్చేశారు. స్థానికంగా ఉండే సంప్రదాయ జానపద కళకు పునరుజ్జీవం తెచ్చారు. ప్రభుత్వ పథకాలన్నిటినీ ఉపయోగించుకునేలా
గ్రామస్తుల్ని జాగృతం చేశారు. ‘ప్రభుత్వ బాధ్యత, పారదర్శకత’ అనే టాపిక్ మీద యు.ఎస్.కాన్సులేట్ ఏర్పాటు చేసిన ‘ఇంటర్నేషనల్ విజిటర్స్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్’ కి సభ్యురాలిగా ఎంపిక అయ్యారు.
భక్తి శర్మ (28), మధ్యప్రదేశ్
యు.ఎస్.లో చదువు ముగించుకుని వచ్చిన భక్తి శర్మ భోపాల్ శివార్లలోని బర్ఖేడీ అబ్దుల్లా గ్రామ సర్పంచ్‌గా పోటీ చేసి గెలిచారు. 2016లో ఫోర్బ్స్ విడుదల చేసిన 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భక్తి శర్మ కూడా ఉన్నారు. పొలిటికల్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత చదువుల కోసం టెక్సాస్‌లోని బంధువుల ఇంట్లో ఉండేందుకు వెళ్లారు. అయితే ఆమెలో ఏ మూలో ఉన్న సేవాభావం ఇండియా రప్పించింది. అందుకోసం ఆమె పెద్ద ఉద్యోగాన్నీ, పెద్ద జీతాన్ని వదులుకుని వచ్చారు. ప్రభుత్వ ప్రథకాలన్నీ ప్రతిదీ గ్రామస్తులకు అందేలా ఆమె కృషి చేస్తున్నారు. తన గ్రామాన్ని మోడల్ పంచాయతీగా మార్చాలని ఆమె తపన.
రాధాదేవి (30), రాజస్థాన్
రాధాదేవి ఐదో తరగతిలోనే బడి మానేశారు. అయితే సర్పంచ్‌గా ఆమె ఇప్పుడు తన భద్సియా గ్రామ పంచాయితీలో ఒక్క విద్యార్థి కూడా బడి మానే పరిస్థితులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ‘రైట్ టు ఎడ్యుడేషన్ యాక్ట్’ ద్వారా బాలికల హాజరును ఆమె పెంచగలిగారు.
సుష్మా బాధు (32), హరియాణా
సుష్మ తన ముఖాన్ని ఘూంఘట్‌తో కప్పుకోకపోవడం ధాని మియాన్ ఖాన్ గ్రామంలో పెద్ద విప్లవానికే దారితీసింది! ముగ్గురు పిల్లల తల్లయిన సుష్మ మొదట ఈ విషయాన్ని భర్తకు చెప్పింది. ‘‘హరియాణా కోడళ్లకు పని చేసుకోడానికి వీల్లేకుండా ఈ గుడ్డ ముఖానికి అడ్డు తగులుతోంది. తీసేస్తాను’’ అని చెప్పింది. ఆయన నివ్వెరపోయి చూశాడు. ఆమె అలా చెప్పిన వారానికి 2012, జూలై 22న చుట్టుపక్కల 25 గ్రామాల్లోని పంచాయతీ మహిళా సభ్యులు, విద్యార్థినులు, అంగన్‌వాడీ కార్యకర్తలతో భారీ సదస్సు జరిగింది. ఆ సదస్సులో వేదిక పైనుంచి బహిరంగంగా తన ముసుగును తొలగించారు సుష్మా! ఆమె చదివింది ఏడు వరకే. అయినప్పటికీ గ్రామం కోసం ఒడుపుగా ఎన్నో పనులు చక్కబెట్టారు. ఆమె నేతృత్వంలో ఆ గ్రామం.. పారిశుధ్యంలో, ‘జీరో డ్రాపవుట్’ రేట్‌లో (ఒక్కరూ మధ్యలో బడి మానేకపోవడం), బాలబాలికల జనాభా చక్కటి నిష్పత్తిలో ఉండటంలో అనేక అవార్డులు గెలుచుకుంది. హరియాణాలోనే ధాని మియాన్ ఖాన్ గ్రామం ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment