పల్లెల్లో బెల్టు పాటలు | Women's associations concern | Sakshi
Sakshi News home page

పల్లెల్లో బెల్టు పాటలు

Published Wed, Jul 13 2016 2:44 AM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM

Women's associations concern

గ్రామాల్లో అనధికార మద్యం షాపులకు వేలం
రూ. లక్షలు పలుకుతున్న వైనం
మద్యం సిండికేట్లు, అధికార పార్టీ నేతల కనుసన్నల్లో వ్యవహారం
పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు
మహిళా సంఘాల ఆందోళన

 

బెల్టు షాపులన్నీ తొలగిస్తాం.. మద్యాన్ని నియంత్రిస్తాం.. గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన అనేక హామీల్లో ఇదొకటి. అధికారంలోకి వచ్చాక అన్ని హామీల్లాగే దీన్ని కూడా తుంగలో తొక్కేశారు. నియంత్రణ మాట దేవుడెరుగు ఇప్పుడు బెల్టు షాపు లేని గ్రామమే లేదు. ఇవి ఏర్పాటు చేయడమే ఒక నేరమైతే వాటికి దర్జాగా వేలం పాటలు కూడా నిర్వహించేస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక చాలా చోట్ల అధికార పార్టీ నేతలు ఉండటంతో అధికారులు కూడా చేతులు కట్టుకొని కూర్చున్నారు.
 
 
చోడవరం : గ్రామాలు మద్యం మత్తులో తేలుతున్నాయి. ఇప్పుడు ఏగ్రామంలో చూసినా బెల్టుషాపులకు  వేలం పాటల సందడే కనిపిస్తోంది. అధికారంలోకి వస్తే బెల్టులు తీసేసి, మద్యాన్ని నియంత్రిస్తానని చెప్పిన  చంద్రబాబు ఆ తరువాత మద్యంపై రూ.వేల కోట్ల ఆదాయం పెంచడమే ధ్వేయంగా విధానాలు రూపొందించారు. గతంలో ఉన్న లెసైన్సు మొత్తాన్ని ఈ ఏడాది భారీగా పెంచడం, అదనంగా  లెసైన్సులు  ఇవ్వడం, ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడంతో 3 వేల జనాభా ఉన్న ప్రతి గ్రామంలోనూ లెసైన్సు మద్యం దుకాణాలు వెలిశాయి.   మద్యం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి లెసైన్డ్ మద్యం షాపులు లేని ప్రతి గ్రామంలోనూ బెల్టు షాపులు ఏర్పాటుచేస్తున్నారు. ఈ విధానం చట్టవిరుద్ధమైనా వాటిని పట్టించుకునే ఎక్సైజ్ అధికారులు మద్యం సిండికేట్ల కన్నుసన్నల్లోనే ఉండటంతో పట్టించుకునే నాధుడే లేకుండా పోయారనే విమర్శలు ఉన్నాయి.

కల్తీ.. అధిక ధరలు: ఈ పరిస్థితిలో ప్రస్తుతం బెల్టుషాపుల కోసం గ్రామాల్లో జోరుగా వేలం పాటలు సాగుతున్నాయి. గత ఏడాది గ్రామానికి ఒకటి ఉంటే ఈ సారి రెండు, కాస్త పెద్ద గ్రామమైతే మూడు బెల్టుషాపులు కూడా పెడుతున్నారు. గ్రామాల్లో తమకు అనుకూలంగా ఉన్న కొందరు గ్రామ పెద్దలతో గ్రామానికి  కొంత సొమ్మును ఇచ్చి, ఎవరు ఎక్కువ పాటపాడితే వారికే బెల్టుషాపు ఇచ్చేలా ఈ వ్యవహారం సాగుతోంది. బెల్టుషాపుల వల్ల మద్యం అమ్మకాలు పెంచి లాభాలు ఆర్జించేందుకు మద్యం వ్యాపారులు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు.  బెల్టు షాపుల్లో లూజుగా  మద్యాన్ని విక్రయిస్తుండటంతో కల్తీ కూడా జోరుగా జరుగుతోంది. బ్రాండెడ్ మద్యంలో చీఫ్ లిక్కర్, నీళ్లు కలుపుతున్నారు. పైగా ఎమ్మార్పీ కంటే అధిక ధరలు వసూలు చేస్తున్నారు.

 లక్షల్లో వేలం పాట:  ఇటీవల కాలంలో లెసైన్సు దుకాణాల్లో అమ్మకాల కంటే గ్రామాల్లో బెల్టు షాపుల అమ్మకాలే ఎక్కువగా ఉండటంతో సిండికేట్లు బెల్టుల నిర్వహణలో పోటీపడుతున్నారు. దీంతో కొన్ని గ్రామాల్లో బెల్టుషాపుల వేలం రూ.లక్షల్లో జరుగుతోంది. చోడవరం మండలం పీఎస్‌పేటలో ఒక బెల్టు షాపునకు గత ఏడాది రూ.2.60 లక్షల వేలం  జరగగా ఈ ఏడా ది తాజాగా జరిగిన పాటలో ఏకంగా రూ.3.5 లక్షలకు  పాడుకున్నారు. ఇదే తరహాల్లో ప్రతి గ్రామంలోనూ రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు బెల్టు వేలం జరుగుతోంది. ఒక్కో మండలంలో ఏటా బెల్టు వేలం పాట రూ.కోటికి పైగా జరుగుతోంది.  గత ఏడాది రూ.40 వేలు ఉన్న బెల్టుషాపు ఈ ఏడాది రెట్టింపైంది. ప్రభుత్వం చీఫ్‌లిక్కర్‌ను మార్కెట్‌లోకి తేవడంతో బెల్టుషాపులకు మంచి గిరాకీ వచ్చింది. ఒక్క చోడవరం నియోజకవర్గంలోనే 290కి పైగా బెల్టుషాపులు ఉన్నాయంటే ఇక జిల్లా వ్యాప్తంగా ఎన్ని వందల షాపులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.   లెసైన్సు షాపులు లేని గ్రామాల్లో సైతం బెల్టుషాపుల పుణ్యమా అని విచ్చలవిడిగా మద్యం దొరకడంతో గ్రామీణ యువత ఎక్కువ శాతం మద్యానికి బానిసలు అవుతున్నారని ఇటీవల ప్రజాసంఘాలు నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. బెల్టుషాపులు పెడితే అరెస్టులు చేస్తామని చెబుతున్న ఎక్సైజ్ అధికారులు గత ఏడాది పెట్టిన కేసులు కనీసం 5 శాతం కూడాలేకపోవడం వారి నిబద్ధతకు అద్దంపడుతోందని ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement