బతుకమ్మ బతుకమ్మ ఉయ్యూలో... బంగారు బతుకమ్మ ఉయ్యూలో అంటూ జాగృతి ఆధ్వర్యంలో
సోమవారం నిర్వహించిన వేడుకలు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించాయి. సంస్థ అధ్యక్షురాలు కవితతోపాటు వేలాది మంది మహిళలు బతుకమ్మలతో తరలిరాగా.. హన్మకొండలోని వడ్డేపల్లి చెరువు కట్ట జనసంద్రాన్ని తలపించింది.
కాజీపేట, న్యూస్‌లైన్ : బతుకమ్మ పాటలు.. మహిళల కోలాటాలు.. కళాకారుల విన్యాసాలతో వడ్డేపల్లి చెరువు పండుగ కళ సంతరించుకుంది. వేలాదిమందితో జనసంద్రమైంది. ఫాతిమానగర్ వడ్డేపల్లి చెరువు వద్ద సోమవారం నిర్వహించిన బంగారు బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొని మహిళలు, కళాకారులతో కలిసి బతుకమ్మ ఆడిపాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బతుకమ్మ పాటలో తెలంగాణ సాహిత్యం, ఆటలో తెలంగాణ జానపద నాట్యం, బతుకమ్మ కూర్పులో నేర్పు.. తెలంగాణ మహిళలకే సొంతమన్నారు. కాకతీయుల పౌరుషాన్ని పుణికి పుచ్చుకున్న ఓరుగల్లు మహిళలు తెలంగాణ ఉద్యమం, ఆటపాటల్లోనూ ఆదర్శంగా నిలిచారన్నారు. బతుకమ్మ పండుగలో పర్యావరణం, సామాజిక అంశాలు మిళితమై ఉన్నాయన్నారు. యువత, మహిళ, సంస్కృతి, సాహిత్యం..
తదితర విభాగాల్లో తెలంగాణ జాగృతి కృషి చేస్తోందని తెలిపారు. వేడుకల్లో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ బంగారు బతుకమ్మ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మహిళలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వేలాదిగా తరలివచ్చిన మహిళలను నియంత్రించేందుకు పోలీసులు చెమటోడ్చాల్సి వచ్చింది. బతుకమ్మ ఆట ముగిసిన అనంతరం కవిత..మహిళలతో కలిసి వెళ్లి బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేశారు. నాగవెల్లి అరుణ తయారుచేసిన తెలంగాణ బతుకమ్మ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జాగృతి యువజన విభాగం రాష్ట్ర కన్వీనర్ విజయభాస్కర్, రాష్ట్ర సాంస్కృతిక మహిళ కన్వీనర్ ఎడవెల్లి విజయ, టీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డి, కేయూ విద్యార్థి జాక్ నేత వాసుదేవరెడ్డి, బోడడిన్నా, కొలి పాక రమాదేవి, కృష్ణ, రహీమున్నీసా, ఉపేంద్ర, విజయ పాల్గొన్నారు.
మహిళా సాంస్కృతిక సమ్మేళనం.. బతుకమ్మ
Published Tue, Oct 8 2013 1:50 AM | Last Updated on Fri, Sep 1 2017 11:26 PM
Advertisement
Advertisement