
గడువు పెంచితే ఊరుకోం: దేవీప్రసాద్
సాక్షి, నల్లగొండ: తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చించడానికి గడువు పొడిగిస్తే ఊరుకునేది లేదని, ఈ ప్రాంత ప్రజల ఆగ్రహం కట్టలు తె ంచుకుంటుందని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ హెచ్చరించారు. నల్లగొండలో మంగళవారం జరిగిన టీఎన్జీవో-2014 డైరీ ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడుతూ చర్చకు గడువు పొడిగించాలనడం అప్రజాస్వామికమని చెప్పారు. ఒకవేళ గడువు పొడిగిస్తే తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులతో సమావేశమై ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యమిచ్చి అసెంబ్లీలో చర్చ జరిపితే, తామే గడువు కావాలని అడిగేవాళ్లని పేర్కొన్నారు. ముసాయిదా బిల్లుపై అభిప్రాయాలు, సూచనలు చెప్పాల్సింది పోయి, ఓటింగ్ కోసం పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని విమర్శించారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులను చూసి, వీళ్లేనా నాయకులు? అని ముక్కు మీద వేలు వేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు.
స్థానికత ఆధారంగానే ఉద్యోగులను, పెన్షనర్లను విభజించాలని డిమాండ్ చేశారు. విభజన పేరుతో ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తే మళ్లీ ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఏపీఎన్‌జీఓలు తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి అనుమతివ్వడాన్ని దే వీప్రసాద్ తప్పుబట్టారు. తెలంగాణవాదులు ఎటువ ంటి ర్యాలీలు, కార్యక్రమాలు చేపట్టేందుకు ఎందుకు అనుమతివ్వలేదని ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడితే తమపై దేశద్రోహం, రైల్వే కేసులు పెట్టిన ప్రభుత్వం.. తెలంగాణ ప్రజలను కించపరిచేలా మాట్లాడినా అశోక్‌బాబుపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? 60 రోజుల సీమాంధ్ర ఉద్యమంలో ఒక్కరినైనా అరెస్టు చేశారా? అని ప్రశ్నిం చారు. మరికొన్ని రోజుల్లో సీఎంవి 100 తప్పులు పూర్తవుతాయని, ఆ తర్వాత తప్పుకోక తప్పదని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ బిల్లును అడ్డుకోవడానికి బీజేపీపై చంద్రబాబు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి కోమటిరెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్, కలెక్టర్ చిరంజీవులు, ఏపీఎన్‌జీఓల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారం రవీందర్డ్డ్రి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడారు.