వి.సావరం(రాయవరం) : ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర సరుకులు తీసుకుని వచ్చేందుకు వెళ్తున్న బట్టీ కార్మికుడు మృత్యువాత పడ్డాడు. ప్రమాదంలో ఉందుర్తి సత్యనారాయణ (50) అనే బట్టీ కార్మికుడు మృతి చెందగా, మోర్త మహేష్ అనే మరో కార్మికుడు తీవ్రగాయాల పాలైన ఘటన శనివారం వి.సావరంలో చోటు చేసుకుంది.
ప్రమాదం జరిగిందిలా..
అమలాపురం మండలం సామంకుర్రుకు చెందిన ఉందుర్తి సత్యనారాయణ, మండలంలోని పసలపూడికి చెందిన మోర్త మహేష్‌లు కుటుంబ సభ్యులతో పనిచేస్తున్నారు. ఇంట్లోకి కావాల్సిన సరుకులు తెచ్చుకునేందుకు మహేష్, సత్యనారాయణ కలిసి మోటార్‌సైకిల్‌పై రాయవరం బయలుదేరాడు. బట్టీకి కొద్ది అడుగుల దూరంలోనే వీరు ప్రయాణిస్తున్న మోటార్‌సైకిల్‌ను రాయవరం నుంచి వెదురుపాక వైపుకు వస్తున్న ట్రాక్టర్ ఢీకొంది. ప్రమాదంలో సత్యనారాయణ అక్కడికక్కడే చనిపోగా, గాయాలపాలైన మహేష్‌ను 108 వాహనంపై రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే మృతుడు సత్యనారాయణ రెండేళ్లుగా బట్టీలో పనిచేస్తున్నాడు. సత్యనారాయణ భార్య మరియమ్మతో కలిసి బట్టీలో పనిచేసుకుంటుండగా, కుమారుడు, కుమార్తె వారి స్వగ్రామంలో నివసిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎస్సై వెలుగుల సురేష్ సంఘటనా స్థలికి వచ్చి ప్రమాద ఘటనపై ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సురేష్ తెలిపారు.
దేవుడా ఎంతపనిచేశావు..
సరుకులు తెస్తానని చెప్పిన నా భర్తను నీ దగ్గరకే తీసుకుని పోయావా..దేవుడా ఎంత పని చేశావంటూ మృతుడు భార్య మరియమ్మ బోరున విలపించింది. బయటకు వెళ్లక పోయినా ప్రాణాలు దక్కి ఉండేవని, ఎంతపని జరిగిందంటూ రోదించిన తీరు స్థానికులను కలచివేసింది.
ట్రాక్టర్ ఢీకొని కార్మికుడి మృతి
Published Sun, May 28 2017 3:53 AM | Last Updated on Tue, Sep 5 2017 12:09 PM
Advertisement
Advertisement