ఇసుక బంగారుమాయె | Works anywhere there ... | Sakshi
Sakshi News home page

ఇసుక బంగారుమాయె

Published Wed, Oct 15 2014 2:32 AM | Last Updated on Sat, Sep 2 2017 2:50 PM

ఇసుక బంగారుమాయె

ఇసుక బంగారుమాయె

  • ఎక్కడి పనులు అక్కడే...
  • స్తంభించిన నిర్మాణ రంగం
  • పస్తులుంటున్న కూలీలు
  • లారీ ఇసుక రూ. 32వేలు !
  • విజయవాడ : ఇసుక దొరక్క జిల్లాలో ప్రజలు నానాయాతన పడుతున్నారు. ఓ పక్క నిర్మాణరంగం స్తంభించిపోగా, మరో వైపు పనులు లేక లక్షలాది  మంది  తాపీ కార్మికులు అగచాట్లు పడుతున్నారు. ఫలితంగా ఎక్కడ పనులు అక్కడే నిలిచి పోతున్నాయి. పట్టణాలు గ్రామాల్లో ఇళ్లు, భవన నిర్మాణాలు చతికల పడ్డాయి. ప్రభుత్వ కట్టడాలకు  సంబంధించిన అభివృద్ధి పనులు కూడా ఇసుక కొరత కారణంగా  నిలిచిపోయాయి.  ఇంటి నిర్మాణానికి ప్రధానంగా అవసరమైన ఇసుక రేటు మూడు రెట్లు పైగా పెరిగింది.

    మూడు మాసాల క్రితం లారీ ఇసుక రూ. 12వేలు ఉండగా ప్రస్తుతం రూ. 32 వేలకు కూడా దొరకడం లేదు.  ఓ సాధారణమైన మూడు గదుల ఇల్లు నిర్మించేందుకు మూడు లారీల ఇసుక అవసరం అవుతోంది. దాని విలువ దాదాపు రూ. 1లక్ష ఖర్చుఅవుతోంది.  ఈ నేపథ్యంలో ఇంటి నిర్మాణం పెనుభారంగా మారడంతో నిర్మాణాలు చేపట్టేందుకు ఎవరూ సాహసించడం లేదు. ఇనుము రేటు కంటే అధికంగా ఉన్న ఇసుకను కొనుగోలు చేయటానికి నానా తంటాలు పడాల్సి వస్తోందని ప్రజానీకం వాపోతున్నారు.

    జిల్లాలో దాదాపు లక్షన్నర మంది టాఫీ కార్మికులుగా పనిచేస్తున్నారు. మరో 50 వేల మంది వరకు నిర్మాణ రంగానికి అనుబంధంగా ఉన్న ఇటుక బట్టీలు, పెయింటింగ్, రాడ్‌బెండింగ్, కార్పెంటర్ , మార్బుల్స్,  తదితర వృత్తుల్లో పని చేస్తున్నారు. అవి  కూడా మూత పడ్డాయి. విజయవాడ నగరంతో పాటు జిల్లాలో ప్రధాన పట్టణాలైన మచిలీపట్నం, గుడివాడ, గన్నవరం, నందిగామ, నూజివీడు, జగ్గయ్యపేటలో నిర్మాణ రంగం పనులు చతికిల పడ్డాయి.  
     
    ఏడాదిగా మూతపడిన క్వారీలు ...
     
    గత ఏడాది కాలంగా జిల్లాలో ఉన్న 72 ఇసుక క్వారీలు మూతపడ్డాయి. దాంతో ఇసుక కొరత తీవ్రమయ్యింది. కొంత కాలం దొంగచాటుగా క్వారీలు నిర్వహించారు. ఇసుక క్వారీల్లో మిషనరీలతో తవ్వవద్దని  సుప్రీంకోర్టు   తీర్పు ఇచ్చింది. అంతకు ముందు జిల్లా అంతటా మిషన్లతో కాంట్రాక్టర్లు, సిండికేట్ అయి ఇష్టారాజ్యంగా తవ్వేసి ప్రభుత్వ ఖజానాకు కోట్లలో గండికొట్టారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు మిషన్లతో తవ్వవద్దని ఆదేశించడంతో క్వారీలు మూతపడ్డాయి.  కొద్ది రోజులుగా   తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి జిల్లాకు ఇసుక లారీలు వస్తున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి చాటుమాటుగా  ఇసుక రావడంతో  అధిక రేట్లు వసూలు చేస్తున్నారు.  
     
    కొత్త పాలసీ అమలు ఎప్పుడో...


    కాగా ప్రభుత్వం ఇసుక తవ్వకాలను డ్వాక్రా సంఘాలకు అప్పజెప్పే కొత్త పాలసీని ప్రకటించింది. కొత్త చట్టం జిల్లాలో ఎప్పటి నుంచి అమలవుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. డ్వాక్రా సంఘాల ముసుగులో కాంట్రాక్టర్లు రంగ ప్రవేశమయ్యేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.  కాగా ఇసుక క్వారీలను కైవసం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు  హడావుడి పడుతున్నట్లు సమాచారం.
     
    పొలిటికల్ మాఫియా తయారవుతుంది :  సీఐటీయూ

    కాగా టీడీపీ ప్రభుత్వం కొత్తగా రూపొందించే డ్వాక్రా సంఘాలకు ఇసుక అమ్మకాలు అప్పగిస్తే పొలిటికల్ మాఫియా పెరుగుతుందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వి. కృష్ణ అన్నారు. గతంలో కంట్రాక్టర్లు రింగ్‌గా ఏర్పడి ఇసుక తవ్వకాలు సాగించి ప్రభుత్వ ఖజానాకు గండికొట్టరని చెప్పారు. డ్వాక్రా సంఘాల ముసుగులో టీడీపీ నేతలు ఇసుక తవ్వకాలు చేపట్టే అవకాశం ఉంటుందన్నారు. నేషనల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇసుక తవ్వకాలు  చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement